పోటెత్తిన గోదావరి | Heavy rains cause severe flooding in the upper region | Sakshi
Sakshi News home page

పోటెత్తిన గోదావరి

Aug 17 2025 5:20 AM | Updated on Aug 17 2025 5:24 AM

Heavy rains cause severe flooding in the upper region

భారీ వర్షాలతో ఎగువ ప్రాంతంలోనూ భారీ వరద 

ఇప్పటికే పోటెత్తుతున్న దిగువ గోదావరి ప్రాంతం 

రెండురోజుల్లో పూర్తిగా నిండనున్న జైక్వాడ్‌ రిజర్వాయర్‌ 

సింగూరు ప్రాజెక్టుకు 31,412 క్యూసెక్కుల వరద  

నిజాంసాగర్‌కు 31,500 క్యూసెక్కుల ప్రవాహం 

శ్రీరాంసాగర్‌కు 1.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

కడెంకు 1.33 లక్షలు, ఎల్లంపల్లికి 2.15 లక్షల క్యూసెక్కుల వరద

నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా కొనసాగుతున్న పంపింగ్‌ 

త్వరలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటి పంపింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌/బాల్కొండ/నిర్మల్‌/రామగుండం: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి నది పోటెత్తింది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 

ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడ్‌ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,738 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 97.29 టీఎంసీలకు చేరింది. రెండు మూడు రోజుల్లో జైక్వాడ్‌ నిండితే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వచ్చే వరద ప్రవాహం మరింత పెరగనుంది. 

రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు వరద 
రాష్ట్రంలో మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు 31,412 క్యూసెక్కుల వరద వస్తుండగా, 21.34 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,634 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు అయినప్పటికీ డ్యామ్‌ భద్రతపై డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌ (డీఎస్‌ఆర్‌పీ) హెచ్చరికల నేపథ్యంలో నిల్వను 21 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 31,500 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.22 టీఎంసీలకు చేరాయి. 

గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 54.63 టీఎంసీలకు పెరిగాయి. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 1.33 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.06 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ, 2.04 లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. 

ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు దిగువన చేపల వేటకు వెళ్లిన కన్నాపూర్‌ గ్రామానికి చెందిన గంగాధర్‌ (41) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఐదు గేట్లు ఎత్తి 25,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఐదు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

శ్రీరాంసాగర్, కడెం నుంచి వస్తున్న వరద తోడుకావడంతో దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 18.23 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 20 గేట్లను ఎత్తి 53,800 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. 

నంది పంప్‌హౌస్‌ ద్వారా మరో 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా 11,000 క్యూసెక్కులను మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లోకి నీటి పంపింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.  

దిగువ గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి 
ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన వరద ఇంకా చేరకపోవడంతో దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌కి 6,142, అన్నారం బరాజ్‌కి 7,825 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. అయితే, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్‌ఏ సూచించిన విషయం తెలిసిందే. 

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో దిగువ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ నుంచి ధవళేశ్వరం బరాజ్‌కు దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది వచ్చి కలవడంతో మేడిగడ్డ బరాజ్‌కి 3.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దాన్ని మొత్తం కిందికి విడుదల చేస్తున్నారు. 

దానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్‌) బరాజ్‌లోకి 4.60 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం బరాజ్‌)లోకి చేరుతున్న 3.56 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండడంతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గుండా ప్రవహించి ధవళేశ్వరం బరాజ్‌ మీదుగా సముద్రంలోకి వరద చేరుతోంది.  

వాగులు వంకలు ఏకం
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు  
పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు 
సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాలు సిద్ధమయ్యాయి. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా: ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబాబాద్, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద పొంగిపొర్లుతోంది. దీంతో ఏటి అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ మండలంలోని గుంజేడువాగు, గాదెవాగు, రాళ్లతెట్టెవాగు, ముస్మివాగు, మొండ్రాయిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం మండలం ఇల్లెందు– మహబూబాబాద్‌ రహదారి పైనుంచి జిన్నెలవర్రె వాగు పొంగి ప్రవహిస్తోంది. 

ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నగర్‌– వెంగ్లాపూర్‌ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, ఎల్బాక, పడిగాపూర్, నార్లాపూర్‌ గ్రామాల్లోని వరి పొలాలు నీట మునిగాయి. 

ఎల్బాక, పడిగాపూర్‌ గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా, శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం, భీంఘనపురం రిజర్వాయర్లలోకి 18 అడుగుల మేర నీరు చేరింది. మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించింది. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల చలివాగుకు వరద పెరిగింది.  

ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఖమ్మం, పాలేరు, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వైరా, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల కాలనీలను వరద ముంచెత్తగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 

ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేటికి వరద నెమ్మదిగా పెరుగుతుండడంతో నీటిమట్టం శనివారం రాత్రి 15 అడుగులకు చేరింది. దీంతో మున్నేటికి ఇరువైపులా పరిస్థితులను ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా: జిల్లాలో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అత్యధికంగా 98.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూరు, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆదిలాబాద్‌ తరుణం వాగులో రెండు లారీలు వరదలో చిక్కుకుపోగా, డ్రైవర్లను పోలీసులు రక్షించారు. 

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, భాగ్యనగర్, కృష్ణానగర్‌ కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బజార్‌హత్నూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి తదితర మండలాల్లో పత్తి, సోయా, వరి పంటలు దెబ్బ తిన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముట్నూరు వద్ద ఆదిలాబాద్‌–మంచిర్యాల రహదారి తెగిపోయింది. సిరికొండలోని చిక్మాన్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాత్నాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.  

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పంట పొలాలు నీట మునిగాయి. బోధన్‌ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జలాల్‌పూర్‌–బడాపహాడ్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి.  

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామారెడ్డి మండలంలో 12.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టు నిండి అలుగులు పోస్తూ మంజీరలోకి ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు, గణపురం ఆనకట్టల ద్వారా కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో మంజీర ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ఇల్లు పూర్తిగా, 11 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement