
భారత్‌లో ధరలు మరీ మండిపోతున్నాయబ్బా..!
ఎన్నారై వ్లాగర్ పరీక్షిత్ బలోచి వ్యాఖ్యలపై భారీ స్పందన
దుబాయ్: భారత్‌లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్‌కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్‌లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్‌లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా.
సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్‌లో ఉంటూ దిర్హామ్‌లలో సంపాదన కలిగిన నేను భారత్‌లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్‌లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్‌లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు.
‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్‌కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు.