
అత్యంత వేగంగా భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న ద్వీపదేశం
అందుబాటులో ఫీజు, సులభ వీసా, ఐక్యూఏ మినహాయింపులతో స్వాగతం
గరిష్టంగా విద్యార్థికి రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానాల్లో న్యూజిలాండ్ సరికొత్త ఆశాకిరణంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కఠినంగా మారుతున్న వీసా నిబంధనలు, విధాన అనిశ్చితుల నేపథ్యంలో విద్యకు న్యూజిలాండ్ కీలకమైన కేంద్రంగా అవతరిస్తోంది. ఇంగ్లిష్ మాట్లాడే వాతావరణం, పారదర్శక విధానాలతో పాటు ముఖ్యంగా భారత సంస్థలతో పెరుగుతున్న సంబంధాలతో న్యూజిలాండ్ ఆశాజనకంగా కనిపిస్తోంది.
34% వృద్ధి నమోదు
ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ డేటా ప్రకారం 2023లో న్యూజిలాండ్ విద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 7,930 కాగా, 2024లో కేవలం జనవరి–ఆగస్టు మధ్యే 34 శాతానికి పైగా వృద్ధితో 10,640కి పెరిగింది. వాస్తవానికి న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 11 శాతం. చైనా తర్వాత అతిపెద్ద విదేశీ విద్యా వనరుగా భారత్ నిలుస్తోంది. ఒక్క మహిళా విద్యార్థుల్లోనే 2023 నుంచి 2024కు 100 శాతం పెరుగుదల నమోదయ్యింది. 2030 నాటికి 40 వేల వరకూ భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ అడుగులు వేస్తోంది. న్యూజిలాండ్‌లో వార్షిక ట్యూషన్ ఫీజులు భారతీయ కరెన్సీలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపే ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో ‘బిగ్ ఫోర్’ దేశాలైన యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విద్యార్థుల దృష్టి న్యూజిలాండ్‌కు మారింది. న్యూజిలాండ్ ఇటీవల తమ దేశానికి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ విద్యార్థులు, అభ్యర్థులకు విధించే నిబంధనల నుంచి భారత్‌కు మినహాయింపులు ఇచ్చింది. దీంతో వలస ప్రక్రియలో మినహాయింపులు పొందుతున్న ఎనిమిది దేశాల సరసన (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్) భారత్ చేరింది. తద్వారా భారత విద్యార్థులకు అంతర్జాతీయ అర్హత అంచనా (ఐక్యూఏ) మినహాయింపులు లభించాయి.
ఐక్యూఏ అనేది న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (ఎన్‌జెడ్‌క్యూఏ) నిర్వహించే ఒక అధికారిక బెంచ్ మార్కింగ్ ప్రక్రియ. ఒక విదేశీ విద్యార్హత.. ఆ దేశ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది. దీనికి తోడు ప్రత్యేక స్కాలర్ షిప్ పథకం ద్వారా విద్యార్థికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తోంది.

పని గంటల పెంపు
పోస్టు స్టడీ వర్క్ (పీఎస్‌డబ్ల్యూ) పాలసీ కూడా న్యూజిలాండ్‌లో చదువుకునే విదేశీ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. కనీసం 30 వారాల మాస్టర్ లేదా డాక్టోరల్ లెవల్ స్టడీని పూర్తి చేసిన విద్యార్థులు ఆ దేశంలోనే ఉండి మూడేళ్ల వరకు పని చేసుకునే వెసులుబాటు ఉండటం విద్యార్థులకు కలిసివస్తోంది. ఇటీవల వారానికి పని గంటలను 20 నుంచి 25కు పెంచింది. నవంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. చదువుకుంటూ పని చేసుకుని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే విద్యార్థులకు ఎంతగానో ఉపకరించే అంశం ఇది.
క్యూఎస్ ర్యాంకుల్లోనూ..
న్యూజిలాండ్‌కు చెందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో ఉత్తమ ర్యాంకులు పొందాయి. ఇవి ఇంజనీరింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, హాస్పిటాలిటీ, నర్సింగ్ వంటి విద్య రంగాల్లో విస్తృత శ్రేణిలో ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి.
భాగస్వామ్య ఒప్పందాలు
ఇటీవల భారత్–న్యూజిలాండ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు పెరుగుతున్నాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రభుత్వం ఐఐఎం–అహ్మదాబాద్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (జీఐఎఫ్‌టీ సిటీ), కర్ణాటక ఉన్నత విద్యా మండలిలో విద్యా సహకార ఒప్పందాలు చేసుకుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా
రంగానికి అనుగుణంగా విధాన మార్పిడి నిర్ణయాలను వేగంగా తీసుకుంటోంది.