కొల్లేరుకు అతిథులొచ్చారు! | Foreign guest birds have arrived in Kolleru | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు అతిథులొచ్చారు!

Nov 26 2025 5:20 AM | Updated on Nov 26 2025 5:20 AM

Foreign guest birds have arrived in Kolleru

శీతాకాలంలో విడిది పక్షుల సందడి 

ఏటా 71 జాతులకు చెందిన 1.20 లక్షల విదేశీ వలస పక్షులు 

అక్టోబరు నుంచి మార్చి చివరి వరకు కనువిందు  

స్థానికంగా 210 రకాల పక్షి జాతులు ఉన్నట్టు గుర్తింపు

కైకలూరు: శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తన రెక్కల చప్పుళ్లతో కొల్లేరుకు విదేశీ అతిథి పక్షులు వచ్చేశాయ్‌. ఏటా నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అటవీ శాఖ అంచనా వేస్తోంది. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. 

కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆ్రస్టేలియా, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా. ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి. 

పక్షుల అత్తారిల్లు కొల్లేరు 
రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్‌సార్‌ సదస్సు గుర్తించిన ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించింది. కొల్లేరు 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. 

ఇరు జిల్లాల్లో ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తితో మార్చి మొదటి వారంలో పుట్టింటికి వెళతాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్‌ పక్షులు అధికంగా రావడంతో దీనికి పెలికాన్‌ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు.  

బార్‌ టెయిల్డ్‌ గాడ్విట్‌ 
నిరి్వరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్‌ టెయిల్డ్‌ గాడ్విట్‌. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి ఏటా వస్తాయి.

ఆర్కిటిక్‌ టర్న్‌  
అత్యధిక దూరం వలస పోయే పక్షి ఆర్కిటిక్‌ టర్న్‌. ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే చేరుకుంటుంది. అలస్కా నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్తుంది.

బార్‌ హెడెడ్‌ గీస్‌  
ఎక్కువ ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందిన బార్‌ హెడెడ్‌ గీస్‌. ఇది సముద్రమట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి, భారత భూభాగంలోని చిలుకా, పులికాట్‌ తదితర సరస్సులకు వస్తాయి.  

గ్రేట్‌ స్నైప్‌ 
అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్‌ స్నైప్, ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం.

కొల్లేరుకు ప్రతి ఏటా వచ్చే విదేశీ వలస పక్షులు.. 
నార్తరన్‌ పిన్‌టైల్‌ (సూది తోక బాతు), రెడ్‌ క్రిస్టడ్‌ పోచర్ట్‌ (ఎర్రతల చిలువ), కామన్‌ శాండ్‌ పైపర్‌ (ఉల్లంకి పిట్ట), పసిఫిక్‌ గోల్డెన్‌ స్లోవర్‌ (బంగారు ఉల్లంకి), కామన్‌ రెడ్‌ షాంక్‌ (ఎర్రకాళ్ల ఉల్లంక్‌), బ్రాహ్మణి షెల్‌ డక్‌(బాపన బాతు), గ్రేట్‌ వైట్‌ పెలికాన్‌ (తెల్ల చిలుక బాతు), బ్లాక్‌ క్యాప్డ్‌ కింగ్‌ఫిషర్‌(నల్ల తల బుచ్చిగాడు), గుల్‌ బిల్డ్‌ టర్న్‌(గౌరి కాకి ముక్కు రేవుపిట్ట), కాస్పియన్‌ టర్న్‌(సముద్రపు కాకి), గ్రేటర్‌ శాండ్‌ ప్లోవర్‌(పెద్ద ఇసుక ఉల్లంకి), రూఫ్‌ (ఈల వేసే పెద్ద చిలువ), మార్స్‌ శాండ్‌పైపర్‌ (చిత్తడి ఉల్లంకి) వంటివి దాదాపు 71 జాతులు ఉన్నట్టు గుర్తించారు.  

పక్షులకు ఎల్లలుండవు 
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్‌ దేశాలు మంచుతో ఉంటా యి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి.  – శ్రీరామ్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్‌ సమీక్షకుడు, హైదరాబాదు 

పక్షులను ప్రేమించాలి 
పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌ చివరన ఏషియన్‌ వాటర్‌ బర్డ్స్‌ సెన్సస్‌(ఏడబ్ల్యూసీ) చేయాలని భావిస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం.   – బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement