మంత్రి చెప్పిన వారికే లక్కీ‘డిప్’!
ఏపీటీడీసీ టెండర్లలో పారదర్శకతకు పాతర
అర్హత లేని సంస్థలకు రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులు
తాజాగా సింహాచలం దేవస్థానం సాంకేతిక సేవలకు పిలిచిన టెండర్లలోనూ ఇదే తీరు!
ఏడాదిన్నరగా అనుకున్న సంస్థకు టెండర్ రాకపోవడంతో బిడ్లు రద్దు చేస్తున్న వైనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)లో టెండర్ల ప్రక్రియ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ నచ్చినోళ్లకు నచ్చినట్టు రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులను కట్టబెట్టే తంతు యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా సింహాచలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం మెరుగైన సాంకేతిక సేవలు అందించేందుకు తలపెట్టిన ‘స్పిర్చువల్ డిజిటల్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు (డీఐపీ–డిప్)’ కాంట్రాక్టునూ అడ్డగోలుగా దోచిపెట్టేందుకు రంగం సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాద్ పథకంలో భాగంగా రూ.2 కోట్లతో అధునాతన మల్టీమీడియా సేవలతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూపకల్పన, నిర్వహణకు ఏపీటీడీసీ ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్‌ఎఫ్‌పీ) బిడ్లను ఆహ్వానించింది. అయితే,ఏడాదిన్నరగా మూడు సార్లు బిడ్ల ప్రక్రియ రద్దవగా.. ఇప్పుడు నాలుగో సారి సైతం గందరగోళంగా మారింది.
అమాత్యులు చెప్పారని బెదిరింపులు..
టెండర్ల ప్రక్రియలో అనర్హ కాంట్రాక్టు సంస్థలకు ఈడీ స్థాయి అధికారులు కొమ్ముకాస్తుండటం వ్యవస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వాస్తవానికి ‘డిప్’ ప్రాజెక్టులో అమాత్యుని అనుకూల వ్యక్తులకు టెండర్లు దక్కకపోవడంతో మూడు సార్లు రద్దు చేసినట్టు సమాచారం. ఇప్పుడు నాలుగోసారి మళ్లీ అర్హులను.. అనర్హులుగా చిత్రీకరించి అమాత్యుని అనుయాయుడికే టెండర్ కట్టబెట్టేందుకు పావులు కదుపుతుండటం అవినీతికి పరాకాష్టగా మారింది.
నాలుగు కంపెనీలు బిడ్లు వేయగా అందులో రాజమహేంద్రవరానికి చెందిన ఓ కంపెనీకి ప్రాజెక్టు దక్కేలా ప్రణాళిక రూపొందించడం చర్చనీయాంశమైంది. పైగా మిగిలిన మూడు కాంట్రాక్టు సంస్థలకు స్వయంగా ఏపీటీడీసీ అధికారులు ‘మంత్రిగారి తాలూకా మనిషికి’ టెండర్ దక్కుతోందని, మీరు తప్పుకోవాలని ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుండటం దిగజారిన పరిస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి ఇదే రాజమహేంద్రవరం కంపెనీకి అనుబంధంగా ఉన్న మరో మౌలిక వసతుల కంపెనీకి అన్నవరం, అఖండగోదావరి వంటి ప్రాజెక్టులను ఇలానే బెదిరింపు ధోరణిలో కట్టబెట్టినట్టు విమర్శలొస్తున్నాయి.
అన్నింటా అనర్హ సంస్థే!
రాజమహేంద్రవరానికి చెందిన కంపెనీకి టెండర్ నిబంధనల ప్రకారం ఏడాదికి రూ.2 కోట్ల టర్నోవర్ లేదు. గత మూడేళ్లలోనూ సదరు సంస్థ ఎన్నడూ రూ.2 కోట్ల మార్కును చేరుకోలేదు. పైగా సంస్థ సమర్పించిన ఆర్థిక లావాదేవీలకు, చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన నివేదికలో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్టు సమాచారం. సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యంత ముఖ్యమైన, ప్రాథమికంగా టెండర్ దరఖాస్తుల్లో సమర్పించాల్సిన ‘ఐఎస్‌ఓ’ సర్టిఫికెటూ లేదు. ఇన్ని లోపాలు ఉన్న సంస్థకు టెండర్ కట్టబెట్టాలని అధికార యంత్రాంగం ఉవ్విళ్లూరుతోంది.
ఏపీటీడీసీ రూపొందించిన నిబంధనల్లో సాంకేతిక బిడ్‌లో టెండర్ రేటును ప్రస్తావిస్తే బిడ్డును తిరస్కరిస్తామని పేర్కొంది. ఇక్కడే సదరు రాజమహేంద్రవరం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతిక బిడ్‌లో టెండర్ రేటును కోట్ చేసినప్పటికీ క్వాలిఫై చేయడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. వాస్తవానికి రూ.2 కోట్ల ప్రాజెక్టు చేపట్టే కంపెనీలకు ఏడాదికి రూ.6కోట్ల వరకు టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంటుంది.
కానీ, ఏపీటీడీïసీ అధికారులు మాత్రం ఆ పద్ధతికి తిలోదకాలు ఇస్తూ రూ.2కోట్ల నుంచి రూ.6కోట్ల వరకు టర్నోవర్‌ని బట్టి కంపెనీలకు మార్కులు నిర్ణయించింది. అంటే, తాము అనుకున్న సంస్థకు రూ.2 కోట్ల టర్నోవర్ ఉంటే టెండర్లలోకి తీసుకొచ్చే యత్నం చేసింది. మరోవైపు సాంకేతిక మూల్యాంకనంలో ప్రెజంటేషన్‌కు 50 మార్కులు పెట్టింది. ఇక్కడ మూల్యాంకనం కమిటీ ప్రెజంటేషన్ బాగోలేదని మార్కులు తగ్గించి తాము అనుకున్న సంస్థకు అధిక మార్కులు వేసే ఎత్తు్తగడ వేసింది. తద్వారా నచ్చిన సంస్థకు టెండర్‌ను కట్టబెట్టేందుకు రాచమార్గాన్ని వేసుకోవడం గమనార్హం.


