కాకినాడ జీజీహెచ్‌లో ఇదే వైద్యం
డాక్టర్లు పట్టించుకోక మరో రోగి మృతి
4 నెలల్లో ఆరు ప్రాణాలు బలి
ఇక్కడికి తెచ్చి చేజేతులా చంపుకొన్నాం..
బాధిత కుటుంబసభ్యుల ఆవేదన
కాకినాడ క్రైం: సీటీ స్కాన్‌కు తీసుకెళ్లేందుకు లంచం.. అత్యవసర విభాగం నుంచి వార్డుకు మార్చేందుకు లంచం.. ప్రాణాపాయంతో కొట్టుకుంటున్నా పట్టించుకోని డాక్టర్లు..! ఫలితంగా కాకినాడ జీజీహెచ్‌లో మరో నిండు ప్రాణం గాల్లో కలిసింది. నాలుగు నెలల వ్యవధిలో ఈ తరహాలో ఇది ఆరో మరణం కావడం గమనార్హం. మంగళవారం మృతి చెందిన వ్యక్తి కుమార్తె వరలక్ష్మి కథనం ప్రకారం... కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన గళ్ల గోదారయ్య (56) రైతు. ఆదివారం పొలంలో పనిచేస్తూ పక్షవాతానికి గురయ్యాడు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ వైద్యులు పరీక్షించి తలలో రక్తం గడ్డ కట్టిందని, కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. సాయంత్రం జీజీహెచ్‌కు తీసుకురాగా అత్యవసర విభాగంలో చేర్చారు. అర్ధరాత్రి ఎస్–8 వార్డుకు తరలించారు.
సోమవారం ఉదయం నుంచి రెండు మాత్రలు, ఒక సెలైన్ మాత్రమే ఎక్కించారు. వైద్యులెవరూ రాలేదు. రాత్రి వేళ గోదారయ్య పరిస్థితి విషమించడంతో వరలక్ష్మి, ఆమె సోదరులు... నర్సుకు తెలిపారు. డాక్టర్ ఐసీయూలో ఉంటారని చెప్పగా అక్కడకు వెళ్లారు. ‘మా నాన్న ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. వచ్చి చూడండి’ అని కోరినా ఆయన స్పందించలేదు. కసురుకుంటూ... ‘వస్తాలే వెళ్లండ’ని చెప్పి, కొన్ని గంటల తర్వాత వచ్చారు. అప్పటికే గోదారయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డాక్టర్ మందులిచ్చి వెళ్లిపోయాక మంగళవారం తెల్లవారుజామున గోదారయ్య ఆరోగ్యం విషమించింది.
‘ఒకసారి చూడండి. నోట్లోంచి నురగ వస్తోంది’ అని పక్క బెడ్ మీద ఉన్న రోగిని పరీక్షిస్తున్న వైద్యురాలిని కోరగా తన బాధ్యత కాదని వెళ్లిపోయారు. నర్సు వచ్చి ఆక్సిజన్ పెట్టినా, మళ్లీ నురగ మొదలైంది. వరలక్ష్మి కుటుంబసభ్యులు మూడంతస్తుల్లోని ఐసీయూలన్నీ తిరిగినా ఒక్క డాక్టరూ రాలేదు. చివరకు గోదారయ్య వద్ద నిస్సహాయంగా కూర్చున్నారు. మధ్యాహ్నం సమయంలో గోదారయ్య చనిపోయాడు. వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడని, జీజీహెచ్‌కు తెచ్చి చేజేతులా చంపుకొన్నామని గోదారయ్య కుమార్తె, కుమారులు విలపించారు.


