సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని.. అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన ఆయన.. రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..
‘‘మా హయాంలో అరటి పంట టన్ను రూ.30 వేలకు పలికింది. 3 లక్షల టన్నుల పంటను ఎక్స్‌పోర్ట్ చేశాం(కరోనా టైంలోనూ పంట ఉత్పత్తితో లాభాలతో మీసం మెలేశామని కొందరు రైతులు చెప్పడం గమనార్హం). అరటి ఎక్స్‌పోర్ట్ కోసం అనంతపురం-ఢిల్లీ, తాడిపత్రి-ముంబైకి రైళ్లు నడిపాం. కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేదు. టన్ను రూ.2 వేలకు కూడా కొనేవాడు లేడు. పంట చెట్టు మీదే మాగిపోతోంది. నెంబర్ వన్‌లో ఉన్న రాష్ట్రం ఈ పరిస్థితికి ఎందుకు దిగజారింది?..
కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. ఈ 17 నెలల కాలంలో 16 విపత్తులొచ్చాయి. కానీ, రైతులకు కనీస సాయం కూడా అందలేదు. గతంలో మా హయాంలో సీజన్ ముగిసేలోపు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇన్‌పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారాయన.
వ్యవసాయమే దండగ అని చంద్రబాబు నమ్ముతున్నారని.. ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి నెలకొంది.. ఆయనకు తప్పకుండా రైతుల ఉసురు తలుగుతుందన్నారు. కూటమి సర్కార్ బంగాళాఖాతంలో కలిసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జగన్ ధ్వజమెత్తారు.
ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌ను విద్యుత్ ఆదా పేరిట మూసివేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌లు కూడా వాడుకోవడం లేదని అన్నారు. వైస్సార్సీపీ హయాంలో వ్యవసాయం అనేది ఒక పండుగలా జరిగిందని.. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు.


