గోర్స– కొత్తపల్లి రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న మలుపు
కొత్తపల్లి – పండూరు, కొమరగిరి – పిఠాపురం రోడ్డులో మలుపులు
నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
పట్టించుకోని అధికారులు
కొత్తపల్లి: రహదారుల్లో మలుపులు ప్రమాదాలకు పిలుపుల్లా మారాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లలోని మలువుల వద్ద రక్షణ చర్యలు కరువయ్యాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికే ఎందరో ప్రాణాలను కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వెళ్లే కొమరగిరి–ఆనందనగర్, గోర్స–నాగంపేట, పండూరు–కొత్తపల్లి రోడ్లలో మలుపులు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికల సూచనల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదకర మలుపుల్లో మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిలో వెళ్లాలంటే వాహన ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
అధికారుల నిర్లక్ష్యం
మండలంలోని పండూరు– కొత్తపల్లి, గోర్స– పిఠాపురం, ఉప్పాడ– పిఠాపురం, నాగులాపల్లి–పిఠాపురం, నాగులాపల్లి– రమణక్కపేట వెళ్లే రోడ్లలో మలుపులు అతి ప్రమాదకరంగా మారాయి. ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలు నియంత్రించే దిశగా రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది.
కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రమాదకరంగా ఉన్న మలుపులు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రతి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మలుపులు వద్ద సూచికల బోర్డులను ఏర్పాటు చేసి ప్రమదాల నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
రహదారి మలుపులు వద్ద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ రహదారుల్లో వెళ్లాలంటే భయపడుతున్నారు. పండూరు – కొత్తపల్లి రోడ్డులో కొమరగిరి శివారు వెంకటరాయపురం సమీయంలో ఉన్న కాలువలో వాహనచోదకులు పడి క్షతగాత్రులువుతున్నారు.
ఇటీవల ఒక వ్యక్తి మృతి చెందాడు. గోర్స భద్రుని చెరువు వద్ద ఉన్న మలుపులో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు ఏ ఒక్క రోజూ కూడా ఈ మలుపులో ఎటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన దాఖలాలేలేవు, రోడ్డుకిరువైపులా తుప్పలు పెరిగిపోవడంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
– సుబ్రహ్మణ్యం, కొమగరగిరి


