ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకొండి
తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపె రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:
ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు: కొమ్మూరి కనకారావు
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం జగన్‌గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్ చేశాయి.
జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్‌కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతతప్ప, న్యూట్రల్ జర్నలిజమ్ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.
వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా?: అంకంరెడ్డి నారాయణమూర్తి
రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్‌గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిని నిందించాయి. జగన్ విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి.
రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజం విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని నారాయణమూర్తి స్పష్టం చేశారు.


