breaking news
brahmana palli
-
నెంబర్ 1గా ఉన్న ఏపీ ఈ పరిస్థితికి దిగజారింది: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని.. అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన ఆయన.. రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘‘మా హయాంలో అరటి పంట టన్ను రూ.30 వేలకు పలికింది. 3 లక్షల టన్నుల పంటను ఎక్స్పోర్ట్ చేశాం(కరోనా టైంలోనూ పంట ఉత్పత్తితో లాభాలతో మీసం మెలేశామని కొందరు రైతులు చెప్పడం గమనార్హం). అరటి ఎక్స్పోర్ట్ కోసం అనంతపురం-ఢిల్లీ, తాడిపత్రి-ముంబైకి రైళ్లు నడిపాం. కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేదు. టన్ను రూ.2 వేలకు కూడా కొనేవాడు లేడు. పంట చెట్టు మీదే మాగిపోతోంది. నెంబర్ వన్‌లో ఉన్న రాష్ట్రం ఈ పరిస్థితికి ఎందుకు దిగజారింది?.. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. ఈ 17 నెలల కాలంలో 16 విపత్తులొచ్చాయి. కానీ, రైతులకు కనీస సాయం కూడా అందలేదు. గతంలో మా హయాంలో సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘‘వ్యవసాయమే దండగ అని చంద్రబాబు నమ్ముతున్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.40 వేలు ఇస్తామని.. రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదు. ఆఖరికి ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకుగానూ ఆయనకు తప్పకుండా రైతుల ఉసురు తలుగుతుందన్నారు. కూటమి సర్కార్ బంగాళాఖాతంలో కలిసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని జగన్ ధ్వజమెత్తారు. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌ను విద్యుత్ ఆదా పేరిట మూసివేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌లు కూడా వాడుకోవడం లేదని అన్నారు. వైస్సార్సీపీ హయాంలో వ్యవసాయం అనేది ఒక పండుగలా జరిగిందని.. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు. -
బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత
► పోలీసుల సాక్షిగా వేటకొడవళ్లతో రెచ్చిపోయిన ప్రత్యర్థులు ► పాతకక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం ► చనిపోయాడనుకుని వదిలివెళ్లిన వైనం తాడిపత్రి రూరల్ : పోలీసుల సాక్షిగా రెచ్చిపోయారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని తమ ప్రత్యర్థి కంటపడగానే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది చుట్టుముట్టారు. వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో బ్రాహ్మణపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎస్ఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం... తాడిపత్రి రూరల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వన్నూరప్ప(40)పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో గురువారం దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను చనిపోయాడనుకుని నిందితులు పరారయ్యారు. ఇంటి స్థలం విషయమై... వన్నూరప్పకు అదే గ్రామానికి చెందిన కతాలప్ప కుటుంబాలకు మధ్య ఇంటి స్థలం విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ విషయంగా గతంలో రెండుసార్లు దాడులు చేసుకున్నారు. నెల కిందట వన్నూరప్ప తన బామ్మర్ది మహమ్మద్ రఫీతో కలసి కతాలప్ప కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అంతటితో ఆగక కతాలప్పపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి గాయపరిచారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న కతాలప్ప కుటుంబ సభ్యులు ఎలాగైనా వన్నూరప్పను అంతమొందించాలనుకున్నారు. ఊరు వదిలేయాలనుకుని.. వన్నూరప్ప ఊరు వదిలేయాలనుకున్నాడు. ఇదే విషయం ఎస్ఐ నారాయణరెడ్డికి తెలిపాడు. ఆయన కానిస్టేబుళ్లను అతని వెంట పంపారు. అయితే ముందుగానే ఈ విషయం తెలుసుకున్న కతాలప్ప వర్గీయులు చిన్నోడు, ఎర్రన్న, హాసన్, మూగన్న, అంజినప్ప సహా మరో నలుగురు కలసి రాడ్లు, వేటకొడవళ్లతో సిద్ధమయ్యారు. వన్నూరప్ప ప్రైవేటు వాహనంతో గ్రామానికి చేరుకోగానే కతాలప్ప వర్గీయులు పోలీసులను పక్కకు నెట్టేసి వేటకొడవళ్లతో వన్నూరప్పపై దాడి చేశారు. ఆ తరువాత వారు పరారయ్యారు. తేరుకున్న కానిస్టేబుళ్లు వెంటనే ఎస్ఐకు విషయం తెలిపారు. ఆయన మరికొంత మంది సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. వన్నూరప్పను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆనంతపురానికి తరలించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


