బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత | hi tension in brahmana palli | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత

Sep 22 2016 11:06 PM | Updated on Sep 4 2017 2:32 PM

పోలీసుల సాక్షిగా రెచ్చిపోయారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని తమ ప్రత్యర్థి కంటపడగానే ఒకరు కాదు.

►   పోలీసుల సాక్షిగా వేటకొడవళ్లతో రెచ్చిపోయిన ప్రత్యర్థులు
►   పాతకక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం
►   చనిపోయాడనుకుని వదిలివెళ్లిన వైనం

తాడిపత్రి రూరల్‌ : పోలీసుల సాక్షిగా రెచ్చిపోయారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని తమ ప్రత్యర్థి కంటపడగానే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది చుట్టుముట్టారు. వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో బ్రాహ్మణపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎస్‌ఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం... తాడిపత్రి రూరల్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వన్నూరప్ప(40)పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో గురువారం దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను చనిపోయాడనుకుని నిందితులు పరారయ్యారు.

ఇంటి స్థలం విషయమై...
వన్నూరప్పకు అదే గ్రామానికి చెందిన  కతాలప్ప కుటుంబాలకు మధ్య ఇంటి స్థలం విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ విషయంగా గతంలో రెండుసార్లు దాడులు చేసుకున్నారు. నెల కిందట వన్నూరప్ప తన బామ్మర్ది మహమ్మద్‌ రఫీతో కలసి కతాలప్ప కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అంతటితో ఆగక కతాలప్పపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి గాయపరిచారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న కతాలప్ప కుటుంబ సభ్యులు ఎలాగైనా వన్నూరప్పను అంతమొందించాలనుకున్నారు.

ఊరు వదిలేయాలనుకుని..
వన్నూరప్ప ఊరు వదిలేయాలనుకున్నాడు. ఇదే విషయం ఎస్‌ఐ నారాయణరెడ్డికి తెలిపాడు. ఆయన కానిస్టేబుళ్లను అతని వెంట పంపారు. అయితే ముందుగానే ఈ విషయం తెలుసుకున్న కతాలప్ప వర్గీయులు చిన్నోడు, ఎర్రన్న, హాసన్, మూగన్న, అంజినప్ప సహా మరో నలుగురు కలసి రాడ్లు, వేటకొడవళ్లతో సిద్ధమయ్యారు. వన్నూరప్ప ప్రైవేటు వాహనంతో గ్రామానికి చేరుకోగానే కతాలప్ప వర్గీయులు పోలీసులను పక్కకు నెట్టేసి వేటకొడవళ్లతో వన్నూరప్పపై దాడి చేశారు. ఆ తరువాత వారు పరారయ్యారు. తేరుకున్న కానిస్టేబుళ్లు వెంటనే ఎస్‌ఐకు విషయం తెలిపారు. ఆయన మరికొంత మంది సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. వన్నూరప్పను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆనంతపురానికి తరలించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement