జగనన్న కాలనీల్లో అసంపూర్తిగా గృహ నిర్మాణాలు
పూర్తి చేయడంపై దృష్టి సారించని హౌసింగ్ అధికారులు
హౌసింగ్ కార్యాలయంలో రెండేళ్లుగా తుప్పుపడుతున్న చువ్వ
లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంపై విమర్శలు
దగదర్తి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సొంతిళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడమే కాకుండా పక్కాగృహాలను సైతం మంజూరు చేసింది. 2024 ఎన్నికల నాటికి కొందరు గృహాలను పూర్తి చేసుకోగా, మరికొందరు వివిధ స్థాయిల వరకు నిర్మాణాలను చేపట్టారు.
ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో గృహ నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం గృహ లబ్ధిదారులకు అందించేందుకు హౌసింగ్ కార్యాలయానికి సరఫరా చేసిన చువ్వను కూడా పంపిణీ చేయలేదు. రెండేళ్లుగా హౌసింగ్ కార్యాలయంలో లక్షలాది రూపాయల విలువైన చువ్వ తుప్పు పట్టిపోతున్నా హౌసింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
1500 పక్కాగృహాలు మంజూరు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మండలంలోని 20 పంచాయతీల్లో 12 చోట్ల జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. అందులో సొంతిళ్లు లేని పేదలకు స్థలాలను కేటాయించారు. సుమారు 1500 పక్కాగృహాలను మంజూరు చేశారు. అందులో ఎన్నికలకు ముందే సుమారు 650 గృహ నిర్మాణాలను పూర్తి చేయగా లబ్ధిదారులు బిల్లులు చెల్లింపులు చేశారు. మరో 67 గృహాలను స్లాబు దశ వరకు నిర్మాణం చేపట్టారు. మిగిలిన గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన వాటిలో ఒక్క గృహ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. కనీసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఇనుమును కూడా పంపిణీ చేయలేదు. దీంతో రెండేళ్లుగా మండల హౌసింగ్ కార్యాలయం బయట లక్షలాది రూపాయల విలువైన ఇనుము వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ తుప్పు పడుతోంది.
గతంలో మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ప్రస్తుతం బిల్లులు చెల్లింపులు చేస్తామని, గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లర్లు, స్లాబు నిర్మించుకుంటామన్న లబ్ధిదారులకు తుప్పు పట్టిన ఇనుమును పంపిణీ చేస్తున్నారు. తుప్పు పట్టిన ఇనుముతో నిర్మాణం చేపడితే నాణ్యత ఎలా ఉంటుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.


