న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత ఐదురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టువీడకపోవడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.
కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నంతా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాజకీయంపైనే వరుస భేటీలు నిర్వహించిందని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అందునా.. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ స్వయంగా చర్చలు జరిపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక కాంగ్రెస్‌లోని ఇరు వర్గాల వాదనలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. దీంతో.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ పంచాయితీకి తెర పడే అవకాశం కనిపిస్తోంది.


