ఇందుకోసం ప్రభుత్వాలు, హైకోర్టులు ఉన్నాయి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ప్రతి విద్వేషపూరిత ప్రసంగం కేసును పర్యవేక్షించడానికి, ఉత్తర్వులివ్వడానికి తాము సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకోసం చట్టపరమైన చర్యలు, పోలీస్‌స్టేషన్లు, హైకోర్టులు ఉన్నాయని తెలిపింది. ఒక వర్గాన్ని ఆర్థికంగా బహిష్కరించాలంటూ ఆన్‌లైన్ వేదికగా వస్తున్న విజ్ఞాపనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
దేశంలో ఏదో ఒక మూల జరిగే ప్రతి చిన్న సంఘటనను తాము పరిశీలించలేమని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఇతర ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయంది. ‘ఈ ఫిర్యాదుపై ముందుగా అధికారుల వద్దకు వెళ్లండి. వారు చర్యలు తీసుకోనివ్వండి. స్పందించని పక్షంలో సంబంధిత హైకోర్టుకు వెళ్లండి’అని పిటిషనర్‌కు సూచించింది.
ప్రజా ప్రయోజన సంబంధమైన అంశం కాకుంటే హైకోర్టులు తగు రీతిలో స్పందిస్తాయని తెలిపింది. భాగల్పూర్ హింస, బిహార్‌లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించి చేసిన విద్వేష వ్యాఖ్యలపై డిసెంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
కస్టోడియల్ మరణాలను ఉపేక్షించం
కస్టడీలో ఉన్న వారిని చిత్ర హింసలకు గురిచేయడం, వారి ప్రాణాలను హరించడం పోలీసు వ్యవస్థపై మాయని మచ్చ అని, ఇలాంటి చర్యలను జాతి సహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీస్‌స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడంపై దాఖలైన సుమోటో కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పైవ్యాఖ్య చేసింది.
వీటిని ఎవరూ సమర్థించడం లేదంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనగా ..మరైతే ఇప్పటి వరకు తగు విధంగా అఫిడవిట్‌ను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఈ విషయాన్ని కేంద్రం చాలా తేలిగ్గా ఎందుకు తీసుకుంటోందని నిలదీయగా మూడు వారాల్లో అఫిడవిట్ వేస్తామని తుషార్ మెహతా బదులిచ్చారు.
రాజస్తాన్‌లో 2025లో మొదటి 8 నెలల కాలంలో 11 కస్టడీ మరణాలు సంభవించడంపై ప్రచురితమైన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతుండటం తెల్సిందే. సీఐబీ, ఈడీ, ఎన్‌ఐఏలు సహా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని 2020లో జారీ చేసిన ఉత్తర్వులపై 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే స్పందించాయని అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు.
ఇందులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడంపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 16 కల్లా కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు అఫిడవిట్‌లు వేయాలని ఆదేశించింది. లేకుంటే కేంద్ర దర్యాప్తు విభాగాల చీఫ్‌లు సహా వివరణతో అందరూ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వేధింపులపై ఎన్‌సీపీసీకి వెళ్లండి
దేశవ్యాప్తంగా నడిచే ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్) స్కూళ్లలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్‌సీపీసీ) ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలోని చిన్నారుల హక్కుల కమిషన్‌లనూ ఆశ్రయించవచ్చని తెలిపింది.
వారు తగు రీతిలో చర్యలకు ఆదేశిస్తారని సూచించింది. ఇస్కాన్ విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయంటూ రజ్‌నీశ్ కపూర్ తదితరులు వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్ సీనియర్ నాయకులు 200 మందికి పైగా చిన్నారులపై లైంగిక, భౌతిక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పిటిషనర్లు తెలిపారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


