న్యూఢిల్లీ: గుజరాత్ వ్యాపారవేత్తలు సందేసర సోదరుల ఆర్థిక కుంబకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు బ్యాంకుల వద్ద రుణాల ఎగవేతకు పాల్పడిన సందేసర సోదరులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు. వారి విజ్ఞప్తికి సుప్రీం కోర్టు అంగీకరించింది. డిసెంబర్ 17లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారిపై నమోదైన అన్నీ క్రిమినల్ కేసులపై విచారణ నిలిపివేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నితిన్ సందేసర, చేతన్ సందేసర,దీప్తి సందేసర ఇతర కుటుంబ సభ్యులు స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రమోట్ చేశారు. ఈ సంస్థ భారత్‌తో పాటు, విదేశీ బ్యాంకుల్లో విదేశీ శాఖల నుంచి రూ.13వేల కోట్లుకు (అంచనా)పైగా రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించి, బ్యాంకులకు నష్టం కలిగించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ కేసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కామ్ కంటే పెద్దదిగా భావించబడుతోంది. పీఎన్‌బీ స్కామ్ (నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ) సుమారు రూ. 13,500 కోట్లుకాగా.. సందేసరా బ్రదర్స్ స్కామ్ రూ. 14,000 కోట్లకు పైగా ఉంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద మోసాలలో ఒకటిగా పరిగణలో ఉంది.
స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై పదుల సంఖ్యలో ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే కేసులు నమోదయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతూ వస్తోంది. ఈక్రమంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తామని సందేసర సోదరులు ముందుకు వచ్చారు. ఇదే అంశంపై జరిగిన విచారణలో సందేసర సోదరుల విజ్ఞప్తికి సుప్రీం కోర్టు సమ్మతి తెలిపింది. డిసెంబర్ 17 లోగా వారు రుణదాత బ్యాంకులకు రూ.5,100 కోట్ల వన్ టైమ్ సెటిల్‌మెంట్ చెల్లించాలనే షరతు విధించింది.
ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నితిన్ సందేసర,చేతన్ సందేసర సహ నిందితులపై సీబీఐ,ఈడీ,పీఎంఎల్‌ఎ కింద దాఖలు చేసిన అన్ని కేసులను సెటిల్‌మెంట్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత క్రిమినల్ విచారణ నిలిపివేస్తామని ఉత్తర్వులో పేర్కొంది. ఆ ఉత్తర్వులో, ప్రజాధనాన్ని తిరిగి పొందడం ప్రాథమిక లక్ష్యం అని బెంచ్ నొక్కి చెప్పింది. మోసం చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తే నేరారోపణలను పొడిగించడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంది.


