నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన.
నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో..
డీకే శివకుమార్‌కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అంతా వాళ్ల చేతుల్లోనే..
కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన.
ఆయన వస్తేనే..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


