పవర్ షేరింగ్ ఫార్ములాపై రకరకాల ఊహాగానాలు.. రోజుకో కొత్త ప్రచారం నడుమ కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకుంటున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. నాయకత్వ మార్పు జరిగితే పార్టీకి నష్టమా? లాభమా? అని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ క్రమంలో మూడో అభ్యర్థి అంశంపైనా ఓ స్పష్టత వచ్చింది.
కర్ణాటక సీఎంను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం లేదు. అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు లాభనష్టాలను బేరీజు వేసుకుంటోంది. అంతిమ నిర్ణయం అగ్రనేతల చేతుల్లోనే ఉండడంతో అది అంత ఈజీ కాదని ఇప్పటికే ఏఐసీసీ వర్గాలు ఓ స్పష్టత వచ్చేశాయి. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనుక తప్పిస్తే ఆ అవకాశం డీకే శివకుమార్‌నే వరించనుందట!. ఈ పంచాయితీలోకి మరో సామాజిక వర్గం, మూడో అభ్యర్థికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని పార్టీ వర్గాల లీకులతో ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.
మూడో అభ్యర్థి అవకాశాలు ఇప్పటికిప్పుడు అస్సలు కనిపించడం లేదని.. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొందని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్యకు మాస్ లీడర్‌గా అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉందని ఆయన వర్గీయులు వాదిస్తున్నాయి. అదే సమయంలో.. డీకే శివకుమార్ బలాలను కూడా ఆయన మద్ధతుదారులు ఢిల్లీ పెద్దలకు నివేదించారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్న డీకేశి నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు వెళ్లడం పార్టీకి కలిసొస్తుందని వాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి సామర్థ్యాలను అధిష్టానం సీరియస్‌గానే పరిశీలించాలనే భావిస్తోంది.
తాజాగా శివకుమార్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య కాస్త పెరిగింది. వాళ్లలో కొందరు ఇవాళ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ డిమాండ్ వినిపించారు. ఈ పరిణామంతో సిద్ధూ వర్గం అప్రమత్తమైంది. అయితే.. ఇది ఇక్కడ(కర్ణాటక) చర్చించే విషయం కాదని.. దానికంటూ ఓ సమయం, సందర్భం ఉంటుందని.. పబ్లిక్‌గా ఈ అంశం గురించి మాట్లాడొద్దని ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేడర్‌కు స్పష్టం చేశారు. అయినా కూడా పలువురు నేతలు మైక్ ముందుకు వచ్చి నాయకత్వ మార్పుపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. దీంతో సీఎం చైర్ హైడ్రామా ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది.


