పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి
లాంగ్ లివ్ హిడ్మా.. అంటూ నినాదాలు
22 మంది ఆందోళనకారుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదస్థాయిలను మించిన వాయు కాలుష్యంపై చేపట్టిన ఆందోళన తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇండియా గేట్ వద్ద సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఆందోళకారులు అడ్డుకోబోయిన పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనలపై పోలీసులు 22 మంది అరెస్ట్ చేశారు.
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడా పోలీసు అధికారులపై దాడికి దిగారు. దీంతో, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారంటూ వీరిపై సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌తోపాటు, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడం తామెన్నడూ చూడలేదని ఓ అధికారి తెలిపారు.
‘ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాము. జంతర్‌మంతర్ వద్ద ముందుగా అనుమతి తీసుకుని ఎవరైనా ఆందోళనకు దిగొచ్చని చెప్పాం. వినకుండా, బారికేడ్లపై నుంచి దూకి వెళ్లి రోడ్డుపై బైటాయించి, ట్రాఫిక్‌కు అవరోధం కలిగించారు. వాహనదారులు కోరినా అక్కడి నుంచి వారు కదల్లేదు’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘పైపెచ్చు, దురుసుగా ప్రవర్తించారు. మాపై దాడికి దిగారు. పెప్పర్ స్ప్రేను వాడారు.
నిరసనకారుల దాడిలో గాయపడిన పోలీసులకు చికిత్స చేయించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, చర్యలు తీసుకుంటాం’అని ఆయన వివరించారు. ఇటీవల ఏపీలో ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు నేత హిడ్మాను, అమర్ రహే హిడ్డా, లాంగ్ లివ్ హిడ్మా అంటూ పోస్టర్లతో కొందరు నినాదాలు చేయడం పైనా దృష్టి సారించామన్నారు.
కాగా, ఇండియా గేట్ వద్ద పోలీసులపై దాడికి దిగిన 22 మందికి సోమవారం ఢిల్లీ కోర్టు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరో వ్యక్తిని, అతడి వయస్సు నిర్ధారణ అయ్యేంత వరకు అబ్జర్వేషన్ హోంకు తరలించాలని ఆదేశించింది. కాగా, గాలి కాలుష్యంపై నిరసన చేపట్టిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యానికి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ప్రభుత్వం మాత్రం నీళ్లు చల్లడం, క్లౌడ్ సీడింగ్ అంటూ కంటితుడుపు చర్యలు చేపడుతోందని ఆరోపించింది.


