విశాఖలో పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం
తీరిగ్గా మేల్కొన్న ఏపీ కాలుష్య నియంత్రణ మండలి
నిబంధనలు పాటించని 7 పరిశ్రమలకు రూ.10 కోట్లు జరిమానా
తనిఖీలు, జరిమానాల పేరుతో రవాణా శాఖ హడావుడి
విషపు గ్యాస్ చాంబర్లుగా మారుతున్న పలు ప్రాంతాలు
సాక్షి, విశాఖపట్నం: అందమైన తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం అంటూ విశాఖపట్నం గురించి గొప్పగా చెప్పుకోవడం ఇక గతమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీ’ కాస్తా ‘సిటీ ఆఫ్ డస్ట్’గా మారుతుంటే.. పాలక యంత్రాంగం ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. దేశంలోనే కాలుష్య పరిస్థితి విషమంగా ఉన్న జాబితాలో విశాఖ నగరం రెండో స్థానానికి చేరుకుందంటే వాయు కాలుష్య పరిస్థితులు ఎంత దుర్భరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర పర్యావరణ సంస్థలు హెచ్చరించిన తర్వాత.. ఇన్నాళ్లూ చాంబర్లకే పరిమితమైన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై జరిమానాల జులుం విదిల్చారు. రవాణా శాఖ యంత్రాంగం కాలం చెల్లిన వాహనాలపై ఫైన్లు విధించడం మొదలు పెట్టింది.
బౌల్ ఏరియాతో సంకట స్థితి
గాలి, నీరు, నేల కాలుష్య కోరల్లో చిక్కుకొని నగరానికి సవాల్ విసురుతున్నాయి. ఓవైపు సుందర తీరం.. మూడు వైపులా కొండలు.. మధ్యలో సుమారు 265 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న విశాఖకు వరంగా భావించేవారు. కానీ.. అదే ఇప్పుడు కొంప ముంచే కాలుష్యానికి కారణంగా మారుతోంది. ఈ విధంగా ఉండటాన్ని బౌల్ ఏరియాగా పిలుస్తుంటారు. ఈ బౌల్ ఏరియాలోకి కాలుష్యం విస్తరిస్తే బయటకు వెళ్లే మార్గముండదని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఏడాదికి 9 నెలల పాటు నైరుతి దిశగా నగరం వైపు గాలులు వీస్తుంటాయి. ఈ దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలలపాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. నగరంలోనే అవి తిష్ట వేసుకొనేటట్లు చేస్తున్నాయి. శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి పైనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలు ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు.
నిద్రలేచిన ఏపీపీసీబీ, రవాణా శాఖ!
ఇన్నాళ్లూ అవే పరిశ్రమలు, అదే కాలుష్యం వెదజల్లుతున్నా.. కనీస తనిఖీలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితుల చేయి దాటిన తర్వాత ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ), జిల్లా రవాణా శాఖ అధికారులు నిద్రలేచారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీలు వేయడంతో హడావుడి మొదలు పెట్టారు. గత డిసెంబర్ 21 నుంచి పరిశ్రమల్లో తనిఖీలు మొదలుపెట్టారు. నిబంధనలు పాటించని ఏడు పరిశ్రమలను గుర్తించి రూ.10 కోట్ల జరిమానాలు విధించారు. ఇన్నాళ్లూ ఈ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఏపీపీసీబీ మొద్దు నిద్ర వ్యవహరించిందా? అనే విమర్శలొస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి బాటలోనే జిల్లా రవాణాశాఖ అధికారులు నడిచారు. ఇప్పుడు చలానాలు వేయడం మొదలెట్టారు. డిసెంబర్ 21 నుంచి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ పేరుతో తనిఖీలు మొదలుపెట్టి.. 32 వాహనాలపై ఓవర్ లోడింగ్, 69 వాహనాలపై పొల్యూషన్ సరి్టఫికెట్ లేదని, టార్పాలిన్ లేకుండా.. దుమ్ము ధూళి లోడింగ్‌తో వెళ్తున్న 58 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.17.54 లక్షల జరిమానా విధించారు. జీవీఎంసీ అధికారులు కూడా కాలుష్య నియంత్రణ కోసం జూలు విదిల్చామని చెప్పేందుకు 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకూ ఈ బృందాలు ఏం చేశాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.
ఆందోళనకరంగాసూచీలు
గత నెల రోజులుగా విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో మాదిరిగా ఏక్యూఐ 326 దాటుతోంది. పలు సందర్భాల్లో 329 కూడా నమోదై ఆందోళన కలిగించింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే కాలుష్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. పారి్టకులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కానీ పీఎం 2.5 రేణువులు రాత్రి వేళల్లో 386గా నమోదవుతోంది.


