సాక్షి బెంగళూరు: హైదరాబాద్, ముంబై, చైన్నై, కోల్‌కతా...దేశంలోని ఈ మెట్రోపాలిటన్ నగరాలన్నింటిలో ఉన్న సాధారణ అంశం ఏమిటి? మురికి కూపాలుగా మారిన నాలలు!. కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా దీనికి మినహాయింపేమీ కాదు కానీ.. అక్కడో అద్భుతం జరిగింది. మురికి నాలా కాస్తా సుందర ఉద్యావనంగా మారింది. మురికి కంపు, చెత్తా చెదారాల స్థానంలో పచ్చటి గడ్డి.. పూల మొక్కలు.. దర్శనమిస్తున్నాయి. పక్షుల కిలకిల రవాలు వినిపిస్తున్నాయి. ఈ కే100 కథా కమామీషేమిటో తెలుసా?

Photo Credits: Mod Foundation
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, పబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా.. బెంగళూరుకు ఉన్న అనేకానేక నామాల్లో ఇవి కొన్ని. ఎప్పుడు 1537లో కెంపేగౌడ అనే విజయనగర సామ్రాజ్యపు పాలెగాడు ఇక్కడ మట్టి కోట కట్టడంతో బెంగళూరు మహా నగర నిర్మాణం మొదలైందని అంచనా. ఆ తరువాతి కాలంలో టిప్పూ సుల్తాన్, మైసూరు మహారాజుల ఏలుబడిలో ఈ నగరం మరింత సుందరంగా తయారైంది. అయితే.. ప్రపంచంలోని అన్ని నగరాల మాదిరిగానే ఆధునిక కాలం వచ్చే సమయానికి బెంగళూరునూ అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే కెంపేగౌడ అప్పుడెప్పుడో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, అన్నింటినీ అసుంధానించే కాల్వలూ కబ్జాలకు గురయ్యాయి. లేదంటే మురికి కాలువలుగా మారాయి. నగరంలోని కోరమంగల లోయ ప్రాంతంలో ఉండే ఇలాంటి ఒకానొక కాలువే.. ఈ ‘‘కే100’.
నగరంలోని ప్రధాన బస్టాండ్ ఒకప్పటి ధర్మాంబుధి చెరవును, కోరమంగలలోని బెళందూరు చెరువును కలుపుతూ ప్రవహించే కే100 వరద కాలువ (కన్నడలో రాజకాలువె అని పిలుస్తారు) నిన్నమొన్నటివరకూ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, మలమూత్రాలతో నిండిపోయి ఉండేది. జనాలు అటువైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. కానీ.. బెంగళూరు నగర కార్పొరేషన్, మోడ్ అనే డిజైన సంస్థ నరేశ్ నరసింహన్ అనే నిపుణుడి పుణ్యమా అని ఇప్పుడు దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు రూ.180 కోట్ల వ్యయంతో మొత్తం పన్నెండు కిలోమీటర్ల పొడవైన కాలువ సుందరీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు.

Photo Credits: Mod Foundation
కాలువ వెంబడే వాక్‌వే...
కే100 ప్రక్షాళనతో మొదలైన సుందరీకరణ పనులు మొదలయ్యాయి. వ్యర్థాలనన్నింటినీ తొలగించడమే కాకుండా.. దీంట్లోకి మురికి నీరు రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు ఈ కాలువ గుండా రోజూ పదమూడు కోట్ల లీటర్ల మురికినీరు ప్రవహించేది. ఇప్పుడు ఈ మోతాదును కేవలం 50 లక్షల లీటర్లకు తగ్గించారు. మురికినీటిని శుద్ధి చేసి వదులుతున్నారు. నీటి వెంబడే పచ్చదనం కోసం రకరకాల మొక్కలు, గడ్డి పొదలు ఏర్పాటు చేశారు. ప్రజలు కాసేపు హాయిగా గడిపేందుకు అక్కడక్కడ సీట్లు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వినోద కార్యక్రమాల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. నాలాకు రెండువైపులా నివసిస్తున్న వారి భాగస్వామ్యం కూడా ఉండటంతో కే100 ఇప్పుడు స్వచ్ఛమైన నదిలా గలగలా పారుతోంది.
ఇప్పుడు ఏమిటి?
కే100 ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలికె (కార్పొరేషన్) ఈ మోడల్‌ను నగరవ్యాప్తం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నగరంలోని మొత్తం 450 కిలోమీటర్ల పొడవైన రాజకాలువెలను కే100 తరహాలు సుందరంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్నపాటి వర్షానికే నగరాలు మునిగిపోకుండా కాపాడవచ్చునని అంచనా. మురికి, చెత్తా చెదారం తొలగిపోవడంతో వరద నీరు సాఫీగా ప్రయాణిస్తుంది కాబట్టి వరద ముప్పు ఉండదన్నమాట. కాలుష్యం, దోమలబెడద కూడా తగ్గుతుంది. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధి, పౌర సంఘాల చేయూతలతో ఇలాంటి అద్భుతాలు ప్రతి మహానగరంలోనూ జరిగితే ఎంత బాగుంటుందో!!!


