ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు.. ప్రతివ్యూహాలు, ఇద్దరి మధ్యే ఇదంతా. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ పదవుల పంతం ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రమే ఈ గొడవను తీరుస్తారని సీనియర్లు చెప్పేశారు. శిడ్లఘట్టలో జరిగిన ఓ ముఖ్యమైన కార్యక్రమంలో ఇద్దరు నేతలూ ఎడమొహం, పెడమొహంగానే దర్శనమిచ్చారు. ఆతీ్మయ పలకరింపులు కానరాలేదు.
సీఎం కుర్చీ గొడవ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ముఖ్యమైన కార్యక్రమాల్లో కలిసే పాల్గొంటున్నారు. చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్టలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సభలో పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. శివకుమార్ వచ్చేవరకు వేచిఉండకుండా సీఎం సిద్దరామయ్య భూమి పూజ నెరవేర్చారు. మంత్రులు కే.హెచ్.మునియప్ప, ఎం.సీ.సుధాకర్, హెచ్.సీ.మహదేవప్ప పాల్గొన్నారు. ఆలస్యంగా చేరుకున్న డీకే వేదిక ముందు ప్రజలకు చేతులు ఊపి అభివాదం చేస్తూ తన కుర్చీ వద్దకు వచ్చారు. ఈ సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు చేతులెత్తి ఆయన నమస్కారాలు చేశారు. సిద్దరామయ్య ముందు కూడా చేతులెత్తి మొక్కి సాగారు. ఇంతకు ముందు వేదికపైకి రాగానే సిద్దు, శివ చేతులు కలిపి ఆతీ్మయతతో మాట్లాడుకునేవారు. ఇప్పుడు అది కనిపించలేదు, అలాగే పక్కపక్కనే కూర్చొని పలకరించుకున్నా గత ఆత్మీయత కనిపించలేదు. ఇద్దరి ముఖాల్లో విచార భావన అగుపించింది.
డీకే వర్గం ఎమ్మెల్యేల ఢిల్లీ యాత్ర
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి స్థానానికి పరిగణించాలని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం మళ్లీ ఢిల్లీ పర్యటన చేపట్టింది. నాలుగు రోజుల క్రితం 7, 8 మంది ఎమ్మెల్యేలు వెళ్లి మల్లికార్జున ఖర్గేతో పాటుగా సీనియర్ నాయకులకు విజ్ఞప్తులు చేశారు. హెచ్.డీ.రంగనాథ్, శరత్ బచ్చేగౌడ, ఆనేకల్ శివణ్ణ, ఎస్.ఆర్.శ్రీనివాస్, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడలు బెంగళూరుకు వెనుతిరిగి వచ్చారు. సోమవారం మళ్లీ ఐదారు మంది ఎమ్మెల్యేలు ప్రయాణం కట్టారు. చన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ, మాగడి ఎమ్మెల్యే బాలకృష్ణ, రామనగర ఎమ్మెల్యే హుసేన్ ఇక్బాల్, మద్దూరు ఎమ్మెల్యే ఉదయ్ కడలూరు, హొసకోట ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, మూడిగెర ఎమ్మెల్యే నయన మోటమ్మ, ఆనేకల్ ఎమ్మెల్యే శ్రీనివాస మానె ఢిల్లీ యాత్ర చేపట్టారు.
డీసీఎం ఇంటికి నాగ సాధువులు
డీసీఎం డీకే శివకుమార్ విశేష పూజలు జరిపిస్తున్నారు. బెంగళూరు సదాశివనగరలోని నివాసానికి సోమవారం ఉదయం కాశీ నుంచి వేదగిరి నాగ బాబా వచ్చి డీ.కే.శివకుమార్ తలపై చేయి ఉంచి ఆశీర్వదించి, భుజం తట్టారు. స్వామీజీకి ఆయన కొంత నగదును బహూకరించారు. కొంతమంది సాధువులు కూడా ఉన్నారు. ఇక గదగ జిల్లా హులిగమ్మదేవి.. రెండున్నర నెలల్లో డీ.కే.శివకుమార్ ముఖ్యమంత్రి కానున్నారని జోస్యం చెప్పింది. జోగతి బైలమ్మ కూడా ఇదే చెప్పారు. సిద్దు, శివ ఇద్దరూ కపటం లేనివారు, సిద్దరామయ్య రెండున్నర నెలల్లో అధికారాన్ని వదిలేయబోతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో: మంత్రి లక్ష్మి
కోలారు: రాష్ట్రంలో పవర్ షేరింగ్ విషయాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తనకు తెలియదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. కోలారులో విలేకరులతో ఆమె మాట్లాడారు. కేపీసీసీ అధ్యక్షునిగా డీకే శివకుమార్, ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉత్తమంగా పని చేస్తున్నారన్నారు. మిగిలిన విషయాలు అన్నీ హై కమాండ్ చూసుకుంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తమ శాఖ గురించి చర్చించానని, ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెల గృహలక్ష్మి డబ్బుల బకాయిలు త్వరలో లబి్ధదారుల ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు.


