సాక్షి,నల్గొండ: జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ పదవి చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గతంగా కలహాలు మొదలయ్యాయి.
పున్నా కైలాష్ తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డీసీసీ పదవి నుంచి అతన్ని తొలగించి, అర్హులైన నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. అంతేకాక, పున్నా కైలాష్‌పై పోలీసు కేసు నమోదు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ రాసినట్లు సమాచారం.
మరోవైపు, కాంగ్రెస్‌లోని బీసీ వర్గాలు మాత్రం కోమటిరెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక బీసీ నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఎదగడాన్ని కోమటిరెడ్డి సహించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి తమ్ముడిని ముందుగా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు
జిల్లాలో కోమటిరెడ్డి అన్నదమ్ముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.వారికి నచ్చని నాయకులు ఎదగకుండా అడ్డుకోవడం, పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యతిరేక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో సీఎం సన్నిహితుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విషయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కక్ష గట్టారని ఆరోపణలు ఉన్నాయి.అగ్రకుల అహంభావంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా కొంతమంది నాయకుల నుంచి వెలువడుతున్నాయి.
జిల్లా కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత
డీసీసీ నియామకంపై మొదలైన ఈ వివాదం ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్‌లో పెద్ద రాజకీయ చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో, డీసీసీ పదవిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.



