సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదిని మంగళవారం సాయంత్రం వెల్లడించారు. షెడ్యూల్ విడుదల నేపథ్యంతో.. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపారామె.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నాం. తొలి విడత ఈనెల 27,రెండో విడత ఈ నెల 30,మూడో విడత డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీరణ ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 11,14, 17 తేదీల్లో ఎన్నికలను నిర్వహించబోతున్నాం. ఎన్నికల కౌంటింగ్ ఫేజ్‌ల వారీగా పోలింగ్ రోజే ఉంటుంది. పోలింగ్ సమయం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు. కౌంటింగ్ 2గంటల నుంచి మొదలు అవుతుంది అని వెల్లడించారామె.
‘‘రాష్ట్రంలో కోటీ 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. గతంలో కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు సర్పంచ్, వార్డ్ మెంబర్‌లకు ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయితీలు, లక్షా 13,534 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఎలక్షన్ అబ్జార్వులను ఇప్పటికే నియమించాం. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు మా వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని స్టేట్ ఎన్నికల కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.



