ప్రభుత్వానికి ఆది ధ్వని ఫౌండేషన్ వినతి
చిన్నారెడ్డితో ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ జానపద ప్రాదేశిక జీవన విధానాలను, కళాత్మక వ్యక్తీకరణాలను ప్రతిబింబించే ఐదువేల కళా ఖండాలను భద్రపర్చేందుకు మ్యూజియం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరుతూ ఆది ధ్వని ఫౌండేషన్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డితో (G. Chinna Reddy) సమావేశమయ్యారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ఆది ధ్వని ఫౌండేషన్ కమిటీ సభ్యులు చిన్నారెడ్డితో చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో 18 ఆదివాసీ తెగలు, బడుగు వర్గాలు, వారి ఉప కులాలు తయారు చేసిన సంగీత వాద్యాలు, లోహ కళా కృతులు, సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన విలువైన వస్తువులను ఒక మ్యూజియంలో భద్రపరచడానికి గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని కమిటీ సభ్యులు చిన్నారెడ్డికి తెలిపారు. సేకరించిన ఈ వస్తువులకు నీడ లేకపోవడం వల్ల పాడైపోయే ప్రమాదం ఉందని, ఆదివాసీల సాంస్కృతిక చిహ్నాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆదివాసీల కళా ఖండాలు, చిహ్నాలను భావితరాలకు అందించేందుకు మ్యూజియం ఏర్పాటు అత్యంత అవశ్యకత ఉందని, అందుకోసం హైదరాబాద్ లోని మాదాపూర్ కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న ఎం.పీ.సీ.సీ. (జీ +1) భవనాన్ని కేటాయించాలని, అందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని కమిటీ సభ్యులు చిన్నారెడ్డిని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని చిన్నారెడ్డి అన్నారు.
చదవండి: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
చిన్నారెడ్డితో భేటీ అయిన వారిలో ఆది ధ్వని ఫౌండేషన్ సభ్యులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, దిగ్గజ పత్రికా సంపాదకులు కే. రామచంద్రామూర్తి, కే. శ్రీనివాస్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ మనోజ, ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి, ప్రముఖ శిల్పి ఎంవి రమణారెడ్డి ఉన్నారు.


