భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం ఉండదు
ఎగుమతి శైలిని మార్చుకుంటే పరిస్థితి సర్దుకుంటుంది
భారత్ ప్రపంచ పటంపై వెలిగిపోయేలా టీఐఈ కార్యాచరణ
హైదరాబాద్ సహా 11 నగరాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం
రైతు ఆదాయం పెరగాలంటే సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి
‘సాక్షి’తో వెంచర్ క్యాపిటలిస్ట్, టీఐఈ సహ వ్యవస్థాపకుడు కాన్వాల్ రేఖీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టీఐఈ) సహ వ్యవస్థాపకుల కాన్వాల్ రేఖీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో సుంకాలు పెంచిన ట్రంప్.. త్వరలో మరింత పెంపుదల ఉంటుందని హెచ్చరిస్తున్నారని, ఒకవేళ ఆవిధంగా సుంకాలు పెంచినా ఆ ప్రభావం తాత్కాలికమేనని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం ఉండదని వివరించారు.
ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకాలు విధిస్తే కొంతకాలం మాత్రమే ఆటుపోటులుంటాయని, వాటి ఎగుమతి శైలిని మార్చుకుంటే పరిస్థితి సర్దుకుంటుందని అన్నారు. దేశ ప్రజలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఉత్పాదకత కూడా వేగంగా పెరుగుతోందని, ప్రపంచంలోనే బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన భారత సంతతికి చెందిన రేఖీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
2047 నాటికి కోటిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఇది మరింత వేగంగా వృద్ధి చెందుతోంది. వివిధ రంగాల్లో ఉత్పాదకత గణనీయ ఫలితాలు సాధిస్తోంది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతోంది. 2047 నాటికి కోటిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భారత్ ప్రపంచ పటంపై వెలిగిపోనుంది. ఆ దిశగా టీఐఈ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం.
దేశంలోని 11 నగరాలను ఎంపిక చేసుకుని దీన్ని అమలు చేస్తున్నాం. ముంబయి, జైపూర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, క్యాలికట్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయనున్నాం. బుధవారం నిజామాబాద్ జిల్లాకు వెళ్లాం. అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అక్కడ ఒక రైతు వ్యవసాయ క్షేత్రాన్ని చూశా. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది. అమెరికాలో ఒక రైతు సగటు ఆదాయం 75 వేల డాలర్లు ఉంటే..ఇండియాలో అది 2,500 డాలర్లు మాత్రమే. ఈ వ్యత్యాసం తగ్గాలంటే సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతం కావాలి.
పారిశ్రామిక పాలసీల ప్రభావం పరిమితమే..
ఎక్కడైనా ప్రభుత్వాలు పారిశ్రామిక పాలసీలు రూపొందించడం అత్యంత సహజం. అయితే వాటి ప్రయోజనాలు ఎక్కువగా పెద్ద కంపెనీలకే దక్కుతాయనేది నా అభిప్రాయం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ ప్రాంత యువతకు ఈ పాలసీలతో పెద్దగా ఒరిగేదేం లేదు. మంచి ఆలోచన, వ్యూహం ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చు. నా ‘ది గ్రౌండ్ బ్రేకర్’పుస్తకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాసిందే. ఒక ఎంట్రప్రెన్యూర్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ధైర్యం, ప్రశంసలు, పాఠాలు ఇలా అన్ని అంశాలను అందులో వివరించా. నా జీవిత కథ, నా ప్రయాణం స్ఫూర్తిగా ఈ పుస్తకం రాశా.
శరవేగంగా హైదరాబాద్ వృద్ధి
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ చురుకుగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకం. అందులోనూ హైదరాబాద్ పాత్ర అత్యంత కీలకం. అందుకే మా లక్ష్య నగరాల్లో హైదరాబాద్‌ను కూడా ఎంపిక చేసుకున్నాం. హైదరాబాద్ అంటే కేవలం నగరాన్ని మాత్రమే కాకుండా సమీపంలోని నిజామాబాద్‌ను కూడా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకుని టీఐఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. కాబట్టి మారుతున్న పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా యువత ఆలోచనలు మారాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలు తయారవుతారు. హైదరాబాద్‌ను చాలాసార్లు సందర్శించా. సందర్శించిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్, ఇప్పుడున్న హైదరాబాద్ మధ్య ఎంతో తేడా ఉంది.


