ట్రాక్‌పై జంతువులను ముందే పసిగట్టే సాంకేతికతను అందుబాటులోకి తేనున్న రైల్వే శాఖ
ప్రమాదాల నివారణకు కృత్రిమ మేధ వినియోగం
త్వరలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రెండు కారిడార్లలో పరిశీలన
రెండు రకాల వ్యవస్థల ఏర్పాటు!
సాక్షి, హైదరాబాద్: వేగంగా దూసుకెళ్లే రైళ్లకు అడ్డుగా ట్రాక్ మీదకు వచ్చే జంతువులను ముందే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ త్వరలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రధాన రైల్వే కారిడార్లలో రైళ్ల గరిష్టం వేగం గంటకు 110 కి.మీ.గా ఉంది. కొన్ని ముఖ్య కారిడార్లను మాత్రం పటిష్ట పరిచి 130 కి.మీ.వేగాన్ని తట్టుకునేలా మార్చారు.
త్వరలో మిగతా కారిడార్లను కూడా ఆ స్థాయికి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించుకుని అమలు ప్రారంభించింది. దీంతో రైళ్ల వేగం కూడా పెరగబోతోంది. ట్రాక్ మీదకు వచ్చే జంతువులు వేగంగా దూసుకెళ్లే రైళ్లకు ప్రమాదకరంగా మారుతున్నాయి.ట్రాక్ మీద జంతువుల కదలికలను ముందే గుర్తించి రైళ్ల వేగాన్ని తగ్గించటంతోపాటు అవసరమైతే నిలిపివేయగలిగేలా కృత్రిమ మేథతో కూడిన సాంకేతికతను వినియోగించుకోనున్నారు.
ఇలా పని చేస్తుంది...
అభివృద్ధి చెందిన దేశాలు కృత్రిమ మేథతో కూడిన వ్యవస్థను ఇందుకు అనుసరిస్తున్నాయి. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో మన రైల్వే శాఖ కూడా దీని ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.ఈ సాంకేతికత రెండు భాగాలుగా ఏర్పాటవుతుంది. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్), ఏఐ– కెమెరాల ఏర్పాటుతో పని చేస్తుంది. ఐడీఎస్ వ్యవస్థ డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (డీఏఎస్) ఆధారంగా పనిచేస్తుంది.ఇందులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ)ను రైలు పట్టాల వెంబడి అమరుస్తారు. ఈ కేబుల్స్ జంతువుల కదలికల నుంచి వచ్చే ప్రకంపనలను 300–500 మీటర్ల దూరం నుంచే గుర్తిస్తాయి.
ఈ సమాచారాన్ని ఏఐ సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ చేసి, రైళ్లలోని లోకో పైలట్‌లు, స్టేషన్‌లోని సంబంధిత సిబ్బందికి, కంట్రోల్ రూమ్‌లకు రియల్–టైమ్ అలర్ట్‌ల ద్వారా పంపుతుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించి జంతువులు ట్రాక్ దాటిన తర్వాత ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటారు. అవి దాటని పక్షంలో రైళ్లను నిలిపేస్తారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 141 రూట్ కిలోమీటర్ల మేర పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఇటీవల అసోంలో రైలు ఢీకొని పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన నేపథ్యంలో దీన్ని వేగంగా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ప్రయోగాత్మక పరిశీలనకు రెండు కారిడార్లలో ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన స్పష్టత రానుంది.


