ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్‌కు అవకాశం
బీసీలకు 32శాతం రిజర్వేషన్ల కోసం సిఫారసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నిక వచ్చే నెల 14న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటరు జాబితా ఈ నెల 16న ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకా శం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రచారానికి వారం రోజుల వ్యవధి ఇచ్చేలా షెడ్యూల్‌పై కసరత్తు జరుగుతోంది.
రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినా చట్టపరమైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని 32 శాతానికే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
నివేదిక అందించిన ‘బూసాని’..
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన బీసీ డెడికేషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదిక అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 12 లేదా 13వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించే పక్షంలో ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం నేపథ్యంలో మున్సిపాలిటీల్లో బీసీ జనాభా స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి పరిమితం కానుండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
రూ.85 కోట్లు విడుదల చేయాలని లేఖ
బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని కోరుతూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పోరేషన్లు కలుపుకుని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిపోయిన ఐదారు కార్పొరేషన్ల పాలక మండళ్లను రద్దే చేయడం లేదా..వారితో రాజీనామా చేయించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


