
ప్రవాసీ ప్రజావాణి ఆరంభ సమయంలో అభ్యర్థనలను స్వీకరిస్తున్న మంత్రి పొన్నం (ఫైల్)
కార్యక్రమం ప్రారంభమై నేటికి ఏడాది పూర్తి
ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ
ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ పర్యవేక్షణ
ఆశ్రయిస్తున్న తెలంగాణ వలస బాధిత కుటుంబాలు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్‌కు గురయ్యాడు. అతనికి బోన్‌మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్‌రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది.
వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గంగయ్యకూ విముక్తి
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్‌లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్‌పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్‌లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.
2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్‌లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం.
ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.
ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు.
వలసదారుల జీవితాల్లో వెలుగులు
వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి.
– రంగు సుధాకర్‌గౌడ్, ఎన్నారై, లండన్