టెర్రరిస్టులకన్నా కాంగ్రెసోళ్లు దుర్మార్గులంటూ హరీశ్‌రావు ధ్వజం
మిడ్‌మానేరుపై ఇసుక మాఫియాపేల్చేసిన చెక్‌డ్యామ్ పరిశీలన
దీనివెనుక కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపణ
సాక్షి పెద్దపల్లి/ఓదెల/జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కూల్చివేతలని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం ఏలుతోందని.. టెర్రరిస్టులకన్నా కాంగ్రెసోళ్లు దుర్మార్గులని దుయ్యబట్టారు. రైతులకు అవసరమైన చెక్‌డ్యాంలు, హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం తప్ప కాంగ్రెస్‌కు కట్టడం తెలియదని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి జిల్లా గుంపుల–కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల మధ్య మానేరుపై గత శుక్రవారం రాత్రి దుండగులు పేల్చేసిన చెక్‌డ్యామ్‌ను హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు మంగళవారం పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ మానేరుపై రూ. 24 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన ఇసుక మాఫియా వెనుక కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు.
గతంలో పెద్దపల్లి మండలం భోజన్నపేట శివారులోని హుస్సేనిమియావాగు చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ నేతలు జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చేసేందుకు యత్నించగా రైతులు పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయినా ఎవరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పుడే దోషులను శిక్షించి ఉంటే గుంపుల చెక్‌డ్యామ్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
కరీంనగర్ ఎల్‌ఎండీ గేట్లు ఎత్తినప్పుడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూలిపోని చెక్‌డ్యామ్.. నాణ్యత లోపంతో కూలిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఒకవేళ నాణ్యత లోపంతో కూలిపోతే చెక్‌డ్యామ్ నిర్మించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని, దోషులను పట్టుకొని రూ. 24 కోట్లు రికవరీ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, నారదాసు లక్ష్మణ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
మహిళలకు చీరలు ఇచ్చిసీఎం ఓట్లడుగుతున్నారు
సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మహిళలకు చీరలు ఇచ్చి ఓట్లడుగుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నియోజకవర్గంలోని 3,129 మహిళా సంఘాలకు రూ. 3.61 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళా సంఘాల్లోని 46 లక్షల మందికే చీరలు ఇవ్వడం విడ్డూరమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు ఇవ్వలేదని.. వడ్డీలేని రుణాలూ ఇవ్వలేదని విమర్శించారు.


