breaking news
Kakinada Government General Hospital
-
రెండు మాత్రలు, ఒక సెలైన్..
కాకినాడ క్రైం: సీటీ స్కాన్‌కు తీసుకెళ్లేందుకు లంచం.. అత్యవసర విభాగం నుంచి వార్డుకు మార్చేందుకు లంచం.. ప్రాణాపాయంతో కొట్టుకుంటున్నా పట్టించుకోని డాక్టర్లు..! ఫలితంగా కాకినాడ జీజీహెచ్‌లో మరో నిండు ప్రాణం గాల్లో కలిసింది. నాలుగు నెలల వ్యవధిలో ఈ తరహాలో ఇది ఆరో మరణం కావడం గమనార్హం. మంగళవారం మృతి చెందిన వ్యక్తి కుమార్తె వరలక్ష్మి కథనం ప్రకారం... కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన గళ్ల గోదారయ్య (56) రైతు. ఆదివారం పొలంలో పనిచేస్తూ పక్షవాతానికి గురయ్యాడు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ వైద్యులు పరీక్షించి తలలో రక్తం గడ్డ కట్టిందని, కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. సాయంత్రం జీజీహెచ్‌కు తీసుకురాగా అత్యవసర విభాగంలో చేర్చారు. అర్ధరాత్రి ఎస్–8 వార్డుకు తరలించారు.సోమవారం ఉదయం నుంచి రెండు మాత్రలు, ఒక సెలైన్ మాత్రమే ఎక్కించారు. వైద్యులెవరూ రాలేదు. రాత్రి వేళ గోదారయ్య పరిస్థితి విషమించడంతో వరలక్ష్మి, ఆమె సోదరులు... నర్సుకు తెలిపారు. డాక్టర్ ఐసీయూలో ఉంటారని చెప్పగా అక్కడకు వెళ్లారు. ‘మా నాన్న ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. వచ్చి చూడండి’ అని కోరినా ఆయన స్పందించలేదు. కసురుకుంటూ... ‘వస్తాలే వెళ్లండ’ని చెప్పి, కొన్ని గంటల తర్వాత వచ్చారు. అప్పటికే గోదారయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డాక్టర్ మందులిచ్చి వెళ్లిపోయాక మంగళవారం తెల్లవారుజామున గోదారయ్య ఆరోగ్యం విషమించింది.‘ఒకసారి చూడండి. నోట్లోంచి నురగ వస్తోంది’ అని పక్క బెడ్ మీద ఉన్న రోగిని పరీక్షిస్తున్న వైద్యురాలిని కోరగా తన బాధ్యత కాదని వెళ్లిపోయారు. నర్సు వచ్చి ఆక్సిజన్ పెట్టినా, మళ్లీ నురగ మొదలైంది. వరలక్ష్మి కుటుంబసభ్యులు మూడంతస్తుల్లోని ఐసీయూలన్నీ తిరిగినా ఒక్క డాక్టరూ రాలేదు. చివరకు గోదారయ్య వద్ద నిస్సహాయంగా కూర్చున్నారు. మధ్యాహ్నం సమయంలో గోదారయ్య చనిపోయాడు. వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడని, జీజీహెచ్‌కు తెచ్చి చేజేతులా చంపుకొన్నామని గోదారయ్య కుమార్తె, కుమారులు విలపించారు. -
వారు ‘తెల్లని’రాబందులు
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : రాబందులు చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అవి మృతకళేబరాలపై వాలి, వాటిని పీక్కు తినడం గగుర్పాటు కలిగిస్తుంది. చూడడానికి రాజహంసల్లా తెల్లటి దుస్తుల్లో ముచ్చటగా ఉండే కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఫోరెన్సిక్ విభాగంలో కొందరు వైద్యులు డబ్బుల కోసం ‘పీక్కు తినడం’లో రాబందులను మించిపోతున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. రాబందులు కళేబరాలను ఆరగిస్తే.. ఆ వైద్యులు తమ ఆత్మీయుల మృతదేహాలను అడ్డం పెట్టుకుని తమ జేబులను నిర్దయతో కొల్లగొడుతున్నారని వాపోతున్నారు. శవపరీక్ష (పోస్టుమార్టం)కు రేటు నిర్ణయించి, అంత మొత్తం చెల్లిస్తే తప్ప శవాన్ని తాకేది లేదని తెగేసి చెపుతున్నారని ఆరోపిస్తున్నారు. వైద్యులు డిమాండ్ చేసినంత సొమ్ము సమకూర్చుకోలేని పేద, మధ్య తరగతి వారు అయినవారి మృతదేహాల కోసం రోజుల తరబడి ఫోరెన్సిక్ విభాగం వద్ద ‘జాగరణ’ చేయాల్సి వస్తోంది. రాజమండ్రికి చెందిన ఓ యువకుడు గోకవరం-రంపచోడవరం రహదారిలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ఈ నెల 10న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ 13న మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు జీజీహెచ్‌లోని ఫోరెన్సిక్ విభాగానికి తీసుకురాగా ఓ వైద్యుడు రూ.5000 డిమాండ్ చేశాడు. మధ్యతరగతి వారైన అతడి బంధువులు బతిమాలినా, కొందరితో సిఫారసు చేయించినా తెల్లదుస్తుల్లోని సదరు వైద్యుడు నల్లటి బండరాయిలా చలించలేదు. చివరికి రూ.4000 ముట్టజెప్పిన బంధువులు అంతకంటే పైసా ఇవ్వలేమని మొర పెట్టుకోవడంతో.. రుసరుసలాడుతూనే పోస్టుమార్టం నిర్వహించాడు. ఫోరెన్సిక్ విభాగంలోని ‘రాబడి రాబందు’ల్లాంటి ఇలాంటి కొందరు వైద్యులు నిత్యం మృతుల బంధువులను డబ్బుల కోసం కాల్చుకు తింటూనే ఉంటున్నారు. శవాలపై సొమ్ములు దండుకునే వారి నికృష్టానికి పరాకాష్ట.. అనాథ మృతదేహాల పోస్టుమార్టంకు కూడా తమ మామూళ్లు ‘మామూలు’గా ఇచ్చి తీరాల్సిందేనని పోలీసులను సైతం పీడించడమే. అడిగినంతా ఇచ్చుకోవలసిందే.. కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)తో పాటు నగరంలోని ఇతర ఆస్పత్రుల్లో మెడికో లీగల్ కేసులకు సంబంధించిన మృతదేహాలను, పరిసరాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ ఆవరణలోని ఆర్ఎంసీ ఫోరెన్సిక్ విభాగానికే తీసుకు వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ రోజుకు ఐదుకుపైగా మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుంటారు. ఫోరెన్సిక్ విభాగంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారే కొందరు వైద్యులు పోస్టుమార్టం చేయాలంటే రూ.5 వేలు ముట్టజెప్పాల్సిందేనని మృతుల బంధువులను పీడిస్తున్నారు. సొమ్ములు ఇవ్వకపోతే పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వరేమో, మృతదేహాలు చెడిపోయే వరకూ జాప్యం చేస్తారేమోననే భయంతో భారమైనా వైద్యులు అడిగిన మొత్తం ముట్టజెపుతున్నారు. చివరికి గుర్తు తెలియని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడకు తరలించిన తమను కూడా విడిచి పెట్టకుండా ముడుపులు గుంజుతున్నారని పోలీసులు వాపోతున్నారు. చర్యలు తీసుకున్నా బేఖాతరు.. గతంలో ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు సొమ్ములు తీసుకున్నాడని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కొన్ని నెలల పాటు పోస్టుమార్టం నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. అయితే ప్రస్తుతం తిరిగి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్న ఆ వైద్యుడు మునుపటిలాగే ‘చావుముడుపు’లు వసూలు చేస్తున్నాడని, అదే ఈ విభాగం బరితెగింపునకు నిదర్శనమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
చెత్తకుండిలో పేలుడు: బాలికకు తీవ్రగాయాలు
చెత్తకుండిలో పేలుడు సంభవించి వీరవాణి (15) అనే బాలికతోపాటు మరో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన యానాంలోని సావిత్రి నగర్లో నిన్న చోటు చేసుకుంది. ఆ ఘటనలో మహిళకు స్వల్పగాయాలు కాగా, బాలికను తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య సాయం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చెత్త కుండిలో పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మందుగుండి సామాగ్రిని చెత్తకుండిలో వేయడం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


