బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కొనసాగించాల్సిందే
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదన
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాలను పంపిణీ చేస్తూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఇచ్చిన తీర్పు (అవార్డు)ను పునఃసమీక్షించడం చట్ట విరుద్ధమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ)–1956లో సెక్షన్–6(2) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీం కోర్టు డిక్రీతో సమానమని వివరించారు.
కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాల్సిందేనని.. లేదంటే పరిస్థితి తలకిందులు అవుతుందని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ 2013 నవంబర్ 29న కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచి్చన తుది నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునరి్వభజన చట్టం–2014లో సెక్షన్–89 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగించాల్సిందేనన్నారు.
ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్, కేడబ్ల్యూడీటీ–2 పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పునఃపంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా తుది వాదనలు వినిపించారు.
కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించిందన్నారు. అప్పట్లోనే ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిందన్నారు. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేస్తూ కేంద్రానికి కేడబ్ల్యూడీటీ–2 కూడా 2010 డిసెంబర్ 31న ఇచ్చిన తొలి నివేదిక.. 2013, నవంబర్ 29న తుది నివేదికలోనూ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యధాతథంగా కొనసాగించిందని వివరించారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందన్నారు. ఆ కేటాయింపులను కొనసాగించాలని కోరారు. కావేరి ట్రిబ్యునల్ దిగువ పరివాహక రాష్ట్రమైన తమిళనాడు హక్కులను పరిరక్షిస్తూ నీటి కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చిoదని, ఇదే విధంగా కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా నీటిని కేటాయించాలని కోరారు, తెలుగు గంగ, ఆర్డీఎస్ కుడి కాలువలకు కేడబ్ల్యూడీటీ–2 నీటి కేటాయింపులు చేసిందని, వాటితోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కోరారు.
బుధవారం, గురువారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు కొనసాగనున్నాయి. ట్రిబ్యునల్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగాల అధికారులు హాజరయ్యారు.


