పేదల ఇళ్లపై సీఎం ఒకలా... మంత్రి మరోలా
మూడేళ్లలో 17 లక్షలకుపైగా ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం చంద్రబాబు
ఐదేళ్లలో 15 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం అని మంత్రి కొలుసు వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించిన 3 లక్షల ఇళ్లను మేమే కట్టేశామని గొప్పలకు పోయిన చంద్రబాబు సర్కారు నవ్వులపాలైంది. పైగా, లక్షల్లో ఇళ్లు నిర్మిస్తామని డాబుసరి ప్రకటనలిస్తున్నారు. అందులోనూ గందరగోళమే. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం ఒకలా, ఆయన మంత్రివర్గంలోని గృహ నిర్మాణ శాఖ మంత్రి మరోలా ప్రకటనలు చేసి అభాసుపాలయ్యారు.
వచ్చే మూడేళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించేస్తామని ఈ నెల 21న గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసి జస్ట్ నాలుగు రోజులయిందో లేదో.. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం మీడియా ముందుకు వచ్చి ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి చేసిన భిన్న ప్రకటనలు పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
అసలైతే అంతా బూటకమే!
పేదల ఇళ్ల నిర్మాణంలో వాస్తవాల్లోకి వెళితే సీఎం, మంత్రి ఇరువురి ప్రకటనలు బూటకమేనని స్పష్టం అవుతుంది. రాష్ట్రంలోని పేదలందరి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ హయాంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద 31.19 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ రికార్డు స్థాయిలో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. గతేడాది జూన్ నాటికి నిర్మాణం పూర్తయిన, తుది దశలో నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లకు స్టేజ్ అప్‌డేట్ చేసేసి తామే కట్టేశామని బాబు ప్రచారం చేసుకున్నారు. ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లనే పూర్తి చేసినట్టు కలరింగ్ ఇవ్వాలని ఇప్పుడు బాబు సర్కార్ స్కెచ్ వేసుకుంది. అంతే తప్ప కొత్తగా నిర్మించేవి, ఇచ్చేవి ఉండవని అధికారవర్గాలే అంటున్నాయి.
15.59 లక్షల ఇళ్లు పూర్తే లక్ష్యం: మంత్రి
ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–1 పథకం అమలు గడువును మరో ఏడాది పాటు పొడిగించిందని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటి వరకు 81 వేల మందిని గుర్తించినట్టు తెలిపారు. దాదాపు 1.15 లక్షల మంది ప్రభుత్వ, పోరంబోకు స్థలాలలో ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు.


