
ఎత్తితే దించలేని.. దించితే ఎత్తలేని స్థితి
జలాశయానికి పెద్ద ఎత్తున వరద
ఇప్పటికే కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో స్టాప్‌లాగ్ గేట్
ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు
హొళగుంద: తుంగభద్ర డ్యాం మళ్లీ ప్రమాదం అంచున ఉంది. గతేడాది 19వ గేటు నదిలో కొట్టుకుపోగా టీబీ బోర్డు అధికారులు దాని స్థానంలో స్టాప్‌లాగ్ గేట్ ఏర్పాటు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే మిగిలిన గేట్లకూ కాలం చెల్లిందని, మొత్తం గేట్లను మార్చాలని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఇచి్చన నివేదిక ఆధారంగా మొత్తం 33 కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సేఫ్టీ కోసం 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు కుదించి ఖరీఫ్‌కు మాత్రమే నీళ్లిచ్చి రబీ సమయంలో పనులు మొదలు పెట్టెందుకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇంకా సమయం ఉండడం, జలాశయానికి వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో మళ్లీ ఎక్కడ కొత్త సమస్య వస్తుందోనని టీబీ బోర్డు అధికారులతో పాటు ఏపీ, కర్ణాటకకు చెందిన కర్నూలు, బళ్లారి, రాయచూరు, అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 19వ స్టాప్‌లాగ్ గేటు మినహాయించి మిగిలిన 32 గేట్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా.. అందులో 4, 11, 18, 20, 24, 27, 28వ గేట్లు మరీ అధ్వాన స్థితికి చేరినట్లు తెలుస్తోంది.
ఆ గేట్లు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎత్తేందుకూ సమస్యగానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుప్పు పట్టి ఉండటంతో ఆ గేట్లను ఎత్తితే.. దింపడం, దించితే ఎత్తడం ఇబ్బందికరమంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనంటూ కన్నడ టీవీ చానళ్లలో ప్రసారమైన వార్తలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.