చంద్రబాబు సర్కార్‌ పాపం.. పోలవరానికి శాపం | Andhra Pradesh Polavaram project coffer dam sinks to 8 feet deep | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ పాపం.. పోలవరానికి శాపం

Aug 17 2025 5:10 AM | Updated on Aug 17 2025 5:10 AM

Andhra Pradesh Polavaram project coffer dam sinks to 8 feet deep

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ కుంగిపోయింది 

10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున భారీ గొయ్యి

భారీ వాహనాల రాకపోకల వల్లే కుంగిందంటున్న నిపుణులు

గుట్టుచప్పుడు కాకుండా మట్టి, రాళ్ల­తో గొయ్యిని పూడ్చివేసిన అధికారులు 

తిరిగి రాకపోకలకు అనుమతి బాబు సర్కార్‌ పాపం.. పోలవరానికి శాపం

ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి వీలుగా వరద ప్రవాహం మళ్లింపునకు నిర్మించిందే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ 

డ్యామ్‌ నిర్మాణ సామగ్రి సరఫరాకు మరో దారిని నిర్మించుకోని కాంట్రాక్టర్‌  

కమీషన్ల కోసం కాఫర్‌ డ్యామ్‌ మీదుగా రాకపోకలకు అనుమతి ఇచి్చన సర్కారు 

గతంలోనూ కమీషన్ల కక్కుర్తితో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ పనుల్లో అక్రమాలు 

40 మీటర్లకు బదులు 20 మీటర్ల లోతుతోనే నిర్మాణం 

2018లో వరదకు కోతకు గురై దెబ్బతిందని ఎత్తిచూపిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ 

అయినా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వం

అందువల్లే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో భారీ సీపేజీ.. 

ఫలితంగా నిపుణుల సూచనతో రూ.వందల కోట్లతో బట్రెస్‌ డ్యామ్‌ నిర్మాణం

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్‌ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ నిర్మాణానికి వీలుగా గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి నిర్మించిన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ తాజాగా కుంగిపోయింది. వాస్తవానికి దీనిపై భారీ వాహనాల రాకపోకలకు అనుమతించకూడదు. కానీ.. బట్రెస్‌ డ్యామ్, డయాఫ్రం వాల్‌ పనులకు అవసరమైన మట్టి, రాళ్లు, కంకర, సిమెంటును భారీ వాహనాల్లో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ మీదుగానే సరఫరా చేస్తున్నారు.

ఇందుకోసం కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌దే. కానీ.. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి, కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ మీదుగానే భారీ వాహనాల్లో వాటిని సరఫరా చేయడానికి సర్కార్‌ అనుమతించింది. ఆ భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రకంపనలు, ఒత్తిడి వల్ల ఎగువ కాఫర్‌ డ్యామ్‌ 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున దిగువకు కుంగి పోయింది.

శుక్రవారం ఉదయం దీన్ని గమనించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రాళ్లు, మట్టి వేసి పూడ్చివేశారు. మళ్లీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చేశారు. ఈ పనులను పోలవరం ఎస్‌ఈ రామచంద్రరావు, ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ భద్రతపై చంద్రబాబు సర్కార్‌ చిత్తశుద్ధి లోపం మరోసారి బహిర్గతమైందని సాగునీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. 

కమీషన్ల కక్కుర్తి వల్లే సీపేజీ 
గోదావరికి 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌లను 2018 జూన్‌ నాటికి అప్పటి చంద్రబాబు సర్కార్‌ పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించే ప్రదేశంలో కమీషన్ల కక్కుర్తితో ఇసుక సాంద్రతను తప్పుగా లెక్కించి.. 40 మీటర్ల లోతుతో నిర్మించాల్సిన జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను 20 మీటర్ల లోతుతో నిర్మించింది. 

⇒ గోదావరి ప్రవాహం ప్రభావం జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ 200 నుంచి 260 మీటర్ల మధ్య కోతకు గురై దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్‌లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. 

⇒ దీనివల్లే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో భారీ ఎత్తున సీపేజీ (లీకేజీ) సమస్య ఉత్పన్నమైందని, ఇది ఎగువ కాఫర్‌ డ్యామ్‌ భద్రతను ప్రశ్నార్థకం చేసిందని స్పష్టం చేసింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ భద్రతకు బట్రెస్‌ డ్యామ్‌ను నిర్మించాలని సూచించింది. దాంతో రూ.వందల కోట్లు వెచ్చించి బట్రెస్‌ డ్యామ్‌ను నిర్మించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వెంటాడుతున్న పాపాలు 
⇒  రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజె­క్టును చంద్రబాబు పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో కేంద్రమే పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలి. కానీ.. కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. 2016 సెప్టెంబర్‌ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పటి చంద్రబాబు సర్కార్‌ దక్కించుకుంది. 

⇒  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) సూచించిన విధానాన్ని తుంగలో తొక్కి.. కమీషన్లు వచ్చే పనులనే చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2 పునాది డయా ఫ్రం వాల్‌ను నిర్మించింది. 

⇒ దీంతో 2017, 2018 గోదావరి వరదల ఉధృతికి డయా ఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయలేక.. ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి, 2019 ఫిబ్రవరి నాటికి చేతులెత్తేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లలో వదిలేసిన ఖాళీలు అంటే 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద 800 మీటర్లకు కుదించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉధృతి మరింత పెరిగి ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది.

⇒ 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. చంద్రబాబు సర్కార్‌ తప్పిదాలను సరిదిద్ది.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించింది. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పూర్తి చేసి.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేసి.. కేంద్రంతో చర్చించి నిధుల సమస్యను పరిష్కరించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పోలవరం ప్రాజెక్టుకు జీవంపోసింది. 

⇒ చంద్రబాబు సర్కార్‌ 2016–18 మధ్య కమీషన్ల కక్కుర్తితో చారిత్రక తప్పిదాలకు పాల్పడకపోయి ఉంటే 2023 నాటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement