కాకినాడ జీజీహెచ్‌లో 20 ఏళ్ల యువతి మృతి
హెర్నియా సర్జరీ చేస్తుండగా సీరియస్
ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
ఆపరేషన్ టేబుల్ మీదే ఏదో జరిగిందంటూ ఫైర్
జీజీహెచ్‌లో తరచూ మరణాలపై విమర్శల వెల్లువ
కాకినాడ క్రైం : కాకినాడ జీజీహెచ్‌లో 20 ఏళ్ల యువతి మరణం శనివారం వివాదాస్పదమైంది. చిన్న ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆమె ప్రాణాలు కోల్పోయిందని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సర్జరీకి తీసుకెళ్లి అపస్మారక స్థితిలో తీసుకొచ్చి ఐసీయూలో చేర్చారని, ఆపరేషన్ టేబుల్ మీదే ఏదో తేడా జరిగిందని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తంచేశారు. ఠాగూర్ సినిమా తరహాలో మూడున్నర గంటల పాటు ఏవేవో చేస్తున్నామని చెప్పి, విగతజీవిగా తమకు అప్పగించారని ఆవేదన చెందారు.
బాధితుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా పిఠాపురం రథాలపేటకు చెందిన రాయుడు కవితకు కృష్ణ అనే వ్యక్తితో వివాహమైంది. పొత్తికడుపు భాగంలో కొద్దిరోజులుగా వాపు ఉంటోంది. వైద్య పరిభాషలో ఈ స్థితిని ‘ఇంగి్వనల్ హెర్నియా’ అంటారు. ఇది వైద్యపరంగా అత్యంత సాధారణ స్థితి అని, చిన్న శస్త్రచికిత్సతో నయమవుతుందని పిఠాపురం వైద్యులు చెప్పడంతో ఈనెల 10న కవిత కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. సాధారణ వార్డులో ఉంచి, ఆమెకు వివిధ ఆరోగ్య పరీక్షలు చేశారు.
సానుకూల ఫలితాలు రావడంతో కవిత ఆరోగ్యంగానే ఉందని నిర్ధారించుకుని శనివారం శస్త్రచికిత్సకు సిద్ధంచేశారు. అప్పటివరకూ ఆమె అందరితోనూ కులాసాగానే మాట్లాడింది. సర్జరీ నిమిత్తం మ.12 గంటల సమయంలో వార్డు నుంచి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అనంతరం.. మ.2 గంటల సమయంలో కొందరు వైద్యులు కంగారుగా ఎంఎన్‌ఓల సాయంతో కవితను ఆర్‌ఐసీయూ–1కి తరలించారు.
అప్పటి నుంచి పీజీల నుంచి హెచ్‌ఓడీల వరకూ ఒక్కొక్కరిగా వచ్చి చూస్తున్నారు. ఇదంతా చూసిన కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే కండిషన్ సీరియస్ అని చెప్పారు. చివరికి.. సా.5.40కి కవిత చనిపోయినట్లు వెల్లడించారు.
మృతదేహం తీసుకెళ్లేందుకు ససేమిరా..
దీంతో.. జీజీహెచ్‌కు నడిచొచ్చిన యువతి ఐదురోజుల్లో విగత జీవిగా మారిందని సహ రోగులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. స్వగ్రామం నుంచి తమ వారు వస్తేనే కానీ మృతదేహాన్ని కదిపేది లేదని తెగేసి చెప్పారు. ఓ దశలో పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి సర్దిచెప్పడంతో వారు రోదిస్తూ, వైద్యుల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు.
వివాదం చేస్తే పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని వైద్యులు బెదిరించడంతో నిస్సహాయంగా వెళ్లిపోయారని సహ రోగులు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈనెల 1న 20 ఏళ్లు పూర్తిచేసుకుని 21వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న కవితకు ఇంతలోనే మరణించిందని కుటుంబీకులు ఆవేదన చెందారు.


