కొత్త ఆశలతో..
● కొద్ది గంటల్లో గతించనున్న 2025
● కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్న జనం
● ఈ ఏడాదైనా తమ జీవితాల్లో
వెలుగులు నింపాలని ఆకాంక్ష
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మరికొద్ది గంటల్లో 2025 కాలగర్భంలో కలసిపోనుంది. సరికొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. గత కాలం పంచిన చేదు కషాయాన్ని బలవంతంగా దిగమింగుకుంటూనే.. అది పంచిన విషాదాన్ని జ్ఞాపకాల పొరల్లో దాచుకుంటూనే.. రానున్న కాలమైనా తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా జనజీవితంపై నిత్యం ప్రభావం చూపే ప్రభుత్వ పాలన ఇకనైనా ప్రజారంజకంగా మారాలని కోరుకుంటున్నారు. గద్దెనెక్కి ఏడాదిన్నరయినా అరకొర పథకాలకే పరిమితమై.. తమ సంక్షేమాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారాలని, ఎన్నికల వేళ తమకిచ్చిన మాటలు ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో నిజం చేయాలని వివిధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ ఆధారమైన జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ఉచిత పంటల బీమా అమలు చేయాలని 2 లక్షల మందికి పైగా రైతులు కోరుకుంటున్నారు. మోంథా తుపానుతో 40 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన అన్నదాతలకు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా పరిహారం ఇవ్వలేదు. కొత్త సంవత్సరంలోనైనా తమపై కనికరం చూపాలని బాధిత రైతులు అభ్యర్థిస్తున్నారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో చెప్పి, ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చే సంవత్సరమైనా ఆ మాట నిలబెట్టుకుంటారని మహిళలు ఆశ పడుతున్నారు. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం ఇస్తామని, అలా ఇవ్వకుంటే ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది బకాయి రూ.1,800 కోట్లయినా విడుదల చేసి తమ హృదయాలు గెలుచుకోవాలని అభిలషిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేలా ప్రభుత్వ పెద్దలకు ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, కొత్త సంవత్సరంలోనైనా తమ జీవితాల్లో వెలుగులు నింపే ఆలోచనలు కలిగించాలని ప్రార్థిస్తున్నారు.


