హాస్టల్‌ విద్యార్థులకు.. సహాయం చేయండి ప్లీజ్‌.. | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థులకు.. సహాయం చేయండి ప్లీజ్‌..

Dec 31 2025 7:09 AM | Updated on Dec 31 2025 7:09 AM

హాస్టల్‌ విద్యార్థులకు..  సహాయం చేయండి ప్లీజ్‌..

హాస్టల్‌ విద్యార్థులకు.. సహాయం చేయండి ప్లీజ్‌..

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించేందుకు దాతలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రజలు ధన, వస్తు రూపంలో సహాయం అందించాలని కలెక్టర్‌ షణ్మోహణ్‌ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 100 సంక్షేమ హాస్టళ్లలో దాదాపు 15 వేల మంది పేద విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరందరికీ మంచి విద్య, ఆరోగ్యం, బంగారు భవిత అందించేందుకు హాస్టళ్లలో కనీస వసతుల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. దీనికి భూరి విరాళాలు అందించాలని కోరారు. నూతన సంవత్సర వేళ తనకు శుభాకాంక్షలు తెలియజేసేవారు ధన రూపంలో లేదా దోమతెరలు, ఆర్‌ఓ ప్లాంట్లు, లైట్లు, ఫ్యాన్లు, మోడ్రన్‌ లైబ్రరీ తదితర వస్తు రూపంలో కానీ సహాయం అందజేయాలని సూచించారు.

నేడు హుండీల ఆదాయం లెక్కింపు

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ నెల హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించనున్నారు. కార్తిక మాసం అనంతరం స్వామివారి హుండీల ఆదాయాన్ని గత నెల 24న లెక్కించారు. అప్పటి నుంచి తెరవకపోవడంతో ఆలయంలోని ప్రధాన హుండీతో పాటు ఇతర హుండీలు చాలావరకూ నిండిపోవడంతో వాటికి సీల్‌ వేశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు జరగనుంది. దీనికి సిబ్బంది అందరూ హాజరు కావాలని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదేశించారు. ఈసారి రూ.1.50 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మాఘంలో కోటి తులసి పూజ

అన్నవరం: వచ్చే మాఘ మాసంలో సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజ నిర్వహించాలని భావిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు మంగళవారం తెలిపారు. ఈ పూజల నిర్వహణకు రెండు ముహూర్తాలు పెట్టాల్సిందిగా వైదిక కమిటీని కోరామన్నారు. పండితులతో చర్చించి ఆ రెండు ముహూర్తాల్లో దేవస్థానానికి అనుకూలమైన తేదీల్లో కోటి తులసి పూజ నిర్వహిస్తామని చెప్పారు. లోక కల్యాణార్థం, సత్యదేవుని భక్తులకు మంచి జరగాలని, తెలిసీ తెలియక చేసిన అపచారాలు తొలగిపోవాలని ఈ పూజలు తలపెట్టామని వివరించారు. 2022, 2023 సంవత్సరాల్లో అప్పటి ఈఓ త్రినాథరావు హయాంలోనే దేవస్థానంలో మహా నారాయణ యాగం, కోటి తులసి పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. దీంతో, గత రెండేళ్లలో రెండు అగ్ని ప్ర మాదాలు, ఆలయ ప్రాంగణంలో పలువురు మృతి చెందడంతో పాటు పలు అవాంఛనీయ సంఘటనలు, వివాదాలు దేవస్థానంలో చోటు చేసుకున్నాయనే వాదనలున్నాయి. అయినప్పటికీ, దే వస్థానంలో సంప్రోక్షణ, హోమాల వంటివి జరగలేదు. దీనిపై ‘అపశృతులు అందుకేనా..?’ శీర్షికన ‘సాక్షి’ అక్టోబర్‌ 7న కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు స్పందించి, సంప్రోక్షణ పూజలు చేశారు. ఇప్పుడు కోటి తులసి పూజ నిర్వహించాలని నిర్ణయించారు.

పలువురికి ఉద్యోగోన్నతులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్‌లో ఆఫీసు సబార్డినేట్లుగా పని చేస్తున్న పలువురికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాసేవ చేసి జిల్లా పరిషత్‌కు మంచి పేరు తేవాలని అన్నారు. ఎంతో కాలంగా ఆఫీస్‌ సబార్డినేట్లుగా సేవలందించామని, ఉద్యోగోన్నతి పొందడం ఎంతో ఆనందంగా ఉందని ప్రమోషన్‌ పొందిన ఉద్యోగులు అన్నారు. జెడ్పీ చైర్మన్‌కు, సీఈఓ లక్ష్మణరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

జనవరి 24న నాటిక పోటీలు

సామర్లకోట: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్నేహ ఆర్ట్స్‌ నాటక పరిషత్‌ అధ్యక్షుడు గొందేసి రాజా తెలిపారు. సంబంధిత బ్రోచర్లను పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వర్యాన మంగళవారం ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రెండు రాష్ట్రాల నుంచి 8 నాటికలు ప్రదర్శిస్తారని రాజా చెప్పారు. ఆరేళ్లుగా ఈ నాటిక పోటీలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఏడో సంవత్సరం మరింత ఉత్సాహంగా ఈ పోటీలు జరగాలని ఆశిస్తున్నట్లు ఎస్సై మౌనిక అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా సందేశాత్మక నాటికలు ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో పరిషత్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement