కట్టెదుట వైకుంఠం..
● రత్నగిరిపై ఘనంగా ‘ముక్కోటి’ వేడుకలు
● ఉత్తర ద్వారం నుంచి
సత్యదేవుడు, అమ్మవారి దర్శనం
● వేకువజాము నుంచే వేచి ఉన్న భక్తులు
● సాయంత్రం వరకూ రద్దీ
అన్నవరం: పాల కడలిలో శేషశయ్యపై ఉత్తరాభిముఖంగా తల పెట్టి పవళించిన శ్రీమహావిష్ణువులా సత్యదేవుడు.. ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీమహాలక్ష్మిగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు.. సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చిన ముక్కోటి ఏకాదశి పర్వదినమైన మంగళవారం.. రత్నగిరి అపర వైకుంఠంలా శోభిల్లింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం వద్ద సుగంధభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున 4 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టుకు స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించి, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఉత్తర ద్వార దర్శనానంతరం భక్తులు తూర్పు ద్వారం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించి సత్యదేవుడు, అమ్మవార్లను, దక్షిణ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి, దిగువన యంత్రాలయాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది. అనంతరం, భక్తులను యథావిధిగా గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. కూరగాయలతో ప్రత్యేకంగా వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు.
ఆకట్టుకున్న పుష్పాలంకరణ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి ఆలయానికి దారి తీసే ఉత్తరం వైపు మెట్లను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చిన మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం, అనివేటి మండపం ముందు సత్యదేవుడు, అమ్మవారి నమూనా విగ్రహాల వద్ద పుష్పాలంకరణ పలువురిని ఆకర్షించింది. ఈ రెండుచోట్లా చాలా మంది భక్తులు ఫొటోలు దిగారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం 11 గంటలకు పండితుల ప్రత్యేక పూజల అనంతరం, ఈఓ త్రినాథరావు దంపతులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు.
కట్టెదుట వైకుంఠం..
కట్టెదుట వైకుంఠం..


