రహదారులు రక్తసిక్తం
కాకినాడ క్రైం: జిల్లా పోలీసు శాఖ వార్షిక నేర నివేదిక విడుదల చేసింది. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్ ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారి ప్రమాదాల్లో జనవరి నుంచి జూన్ వరకూ 170, జూలై నుంచి డిసెంబర్ వరకూ 130 మరణాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది 859 రోడ్డు ప్రమాదాలు జరగగా ఈ ఏడాది ఆ సంఖ్య 787కు తగ్గిందని, 8.38 శాతం మేర రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ తెలిపారు. రహదారులపై జూలై నుంచి ఏర్పాటు చేసిన అధునాతన స్మార్ట్ పార్కింగ్ అలెర్ట్ సిస్టం ద్వారా రెండో అర్ధ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలిగామని చెప్పారు.
మెడలో గొలుసులు జాగ్రత్త
జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 31 కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 57కు పెరిగింది. ఈ నేరాలు ఏకంగా 83.87 శాతం మేర పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల చోరీలు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 301 వాహనాలు చోరీ కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 480 వాహనాలను దొంగలు అపహరించారు. ఏకంగా 59.47 శాతం మేర బైక్ దొంగతనాలు పెరిగాయి.
రాత్రయితే ఇల్లు గుల్లే..
జిల్లాలో రాత్రి వేళ దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ తరహా చోరీలు గత ఏడాది 110 నమోదవగా.. ఈ ఏడాది 151 కేసులు వచ్చాయి. వీటి పెరుగుదల 37.27 శాతంగా నమోదైంది. సమయంతో నిమిత్తం లేకుండా ఆస్తులు కొల్లగొట్టి దోచుకెళుతున్న కేసులు గత ఏడాది 738 నమోదైతే ఈ ఏడాది ఏకంగా వెయ్యికి (+35.50 శాతం) పెరిగాయి.
తగ్గిన అత్యాచారాలు
మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు ఈ ఏడాది తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది 19 అత్యాచార కేసులు నమోదైతే ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పరిమితమై, 47.37 శాతం మేర తగ్గాయి. అలాగే, మహిళల మరణాలకు సైతం కారణమవుతున్న వరకట్న వేధింపు కేసులు గత ఏడాది 383 న మోదవగా.. ఈ ఏడాది 336కు తగ్గాయి. వీటి తగ్గుదల 12.27 శాతం ఉందని ఎస్పీ చెప్పారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 65 రాగా, ఈ ఏడాది 46 (29.23 శాతం తగ్గుదల) నమోదయ్యాయి.
హత్యలు.. మాదక ద్రవ్యాలు
జిల్లాలో హత్యలు గత ఏడాది కంటే పెరిగాయి. 2024లో 28 హత్యలు జరగగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 33కు (+17.86 శాతం) పెరిగింది. మరోవైపు గత ఏడాది గంజాయి కేసులు 35 నమోదవగా.. ఈ ఏడాది గంజాయి అనుబంధ మాదకద్రవ్యాల కేసులు 43 (+22.86 శాతం) నమోదయ్యాయి.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల
మృతులు 300 మంది
పెరిగిన చైన్ స్నాచింగ్‌లు, సైబర్ నేరాలు
తగ్గిన వరకట్న వేధింపులు,
దళితులపై నేరాలు
2025 వార్షిక నేర నివేదిక విడుదల
రికవరీలు అంతంత మాత్రం
చోరీ కేసులలో సొత్తు రికవరీ అంతంత మాత్రంగానే ఉంది. బంగారం 60 శాతం, వెండి 64 శా తం, నగదు 62 శాతం మేర మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. వివిధ కేసులలో రూ.9.01 కోట్ల నగదు చోరీ కాగా.. రూ.5.60 కోట్లు రికవరీ చేయగలిగారు. మొత్తం మీద ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. సీసీ కెమెరాల వినియోగం, నేరాల నియంత్రణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక బృందాల పని తీరు, సాంకేతికత వినియోగం ఈ పురోగతికి కారణమని చెప్పారు. గత ఏడాది 7,947 నేరాలు జరగగా.. ఈ ఏడాది 171 తగ్గి (2.15 శాతం) 7,776 నమోదయ్యాయన్నారు. 5.2 కిలోల బంగారం, 92.40 కిలోల వెండి, రూ.8.52 కోట్ల నగదు, మూడు లారీలు, 21 ఆటోలు, 360 బైకులు, 1,541 సెల్‌ఫోన్లు రికవరీ చేసి, 813 మందిని అరెస్టు చేశామని వివరించారు. వచ్చే ఏడాది కూడా ప్రత్యేక ప్రణాళికతో నేర నియంత్రణలో సానుకూల ఫలితాలు రాబడతామని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


