
కేంద్ర జల్ శక్తి శాఖకు తేల్చిచెప్పిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ
పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వచేస్తేనే బనకచర్లకు గోదావరి
కానీ 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం
దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకే నీళ్లందించలేం..
ఇక పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం అసాధ్యం
ఇదే అంశాన్ని ఈ ఏడాది జనవరి 24న ఎత్తిచూపిన ‘సాక్షి’
‘పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?’ శీర్షికతో కథనం
చంద్రబాబు ప్రభుత్వ అంగీకారంతోనే పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపు
అందుకే ఈ దుస్థితి అంటున్న సాగు నీటి రంగ నిపుణులు
తద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికీ నీళ్లందించడం సాధ్యం కాదని స్పష్టీకరణ
గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై 2 ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఛత్తీస్‌గఢ్.. రూ.45 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం!
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93%
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు?.. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి
పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా?
నీళ్లు రాని ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ చేసి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడ అని నిపుణులు, విమర్శకుల ధ్వజం
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సాధ్యం కాదు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు (పీబీఎల్‌పీ)కు నీరివ్వడం అసాధ్యం’’ అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తెగేసి చెప్పింది. ఈ మేరకు పీపీఏ డైరెక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పీబీఎల్‌పీపై ఏదైనా ఆలోచన చేయవచ్చునని స్పష్టం చేశారు.
పీబీఎల్‌పీకి సంబంధించి డీపీఆర్ రూపకల్పనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ మే 22న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు ప్రాథమిక నివేదిక (పీఎఫ్ఆర్)ను సమర్పించారు. సీడబ్ల్యూసీ... ఈ ప్రాథమిక నివేదికపై పీపీఏ అభిప్రాయం కోరింది. దీనిని సమగ్రంగా అధ్యయనం చేసిన పీపీఏ తన అభిప్రాయాన్ని తెలిపింది.
పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా... ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా గత ఏడాది ఆగస్టు 28న కేంద్రం ఆమోదించిందని, మిగిలిన పనులకు రూ.12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చిచెప్పిందని పేర్కొంది. దీని ప్రకారమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని లేఖలో వివరించింది.
పీబీఎల్‌పీ... పోలవరంలో భాగం కాదని, ఈ నేపథ్యంలో పోలవరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పీపీఏ పేర్కొంది. అందుబాటులో ఉన్న జలాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పీబీఎల్పీలో తాడిపూడి ఎత్తిపోతల కాలువను ఉపయోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోందనికానీ, పోలవరం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల ఆయకట్టు కూడా పోలవరంలో భాగం అవుతుందని తెలిపింది.
పోలవరం కుడి కాలువ, డిస్ట్రిబ్యూటరీలపై అధ్యయనం చేయాలని సూచించింది. 1980 ఏప్రిల్ 2న అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం నిర్వహణ షెడ్యూల్‌ను రూపొందించారని, పోలవరం నుంచి పీబీఎల్‌పీ ద్వారా 200 టీఎంసీలను మళ్లించే క్రమంలో నాటి షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని తేల్చిచెప్పింది. పోలవరం కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్)కు తరలించేలా పీబీఎల్‌పీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
80 లక్షల మందికి తాగు, 7.41 లక్షల ఎకరాలకు సాగు నీరు, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు... పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీలను సరఫరా చేస్తామని చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.81,900 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది.
కేవలం కమీషన్ల కోసమే బాబు సర్కారు బనకచర్ల రాగం...!
రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే చేపడుతున్నట్లు స్పష్టం అవుతోందని సాగునీటి రంగ నిపుణులు, విమర్శకులు పేర్కొంటున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.45 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారని చెబుతున్నారు.
అంతేగాక సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93 శాతం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా? అని నిలదీస్తున్నారు. నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా.. ఎర్త్ వర్క్ చేసి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడతో పోలవరం–బనకచర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు.
జనవరిలోనే ‘సాక్షి’ కథనం.. అక్షర సత్యం
పీబీఎల్‌పీకి ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు చంద్రబాబు ప్రభుత్వం జనవరి 24న ప్రతిపాదనలు పంపింది. అప్పుడే ‘‘పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?’’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపింది. ఇప్పుడు పీపీఏ డైరెక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ కూడా ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని నిరూపించేలా కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాయడం గమనార్హం.
జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే..
పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్‌వేను 2021 జూన్ 11 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ, గతేడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
దీనిని ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, టీడీపీకి చెందిన రామ్మోహన్నాయుడు వ్యతిరేకించలేదు. అంటే... పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్న మాట. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేందన్నది కూడా స్పష్టమవుతోంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో 115.4 టీఎంసీలనే నిల్వ చేయొచ్చు.
కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా బనకచర్లకు గోదావరి జలాలను తరలించడం ఎలా సాధ్యమన్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి.
పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి, జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే పీబీఎల్‌పీకి శాపంగా మారిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జనవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పీబీఎల్పీకే కాదు... పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీళ్లందించడమూ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు పీబీఎల్‌పీని రాయలసీమకు గోదావరి జలాలు అందించాలన్న చిత్తశుద్ధితో కాదు.. కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని పీపీఏ లేఖతో బట్టబయలైంది.