ఘటనా స్థలిలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న రవిశంకర్ అయ్యన్నార్
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతి కేసును ప్రత్యేకంగా విచారిస్తున్న సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
పరిశోధన పూర్తవకుండా, అనుమానాస్పద మృతిగా కాకుండా హత్యగా పేర్కొనడంపై సందేహాలు
దీనివెనుక ప్రభుత్వంలోని కొందరు పెద్దల కీలక ఆదేశాలు
వారు అనుకున్న వ్యక్తులను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం?
సతీశ్‌ది హత్యే అయితే బోగీలో వేరే వ్యక్తులు ఎవరు?
ఇది సాధ్యమా? అని తెలియకుండా హత్య కేసు నమోదు
సతీశ్‌ను ఎవరైనా వెంటాడినట్లుగా సీసీ ఫుటేజీ లేదు
ఈ కీలక అంశాలపై దృష్టిసారించని పోలీసులు
టీడీపీ అధికారిక వెబ్‌సైట్, ఎల్లో మీడియాకు లీకులు
ఎఫ్‌ఐఆర్‌లో శనివారం హత్యగా పేర్కొన్న వైనం
పరకామణి అపోనెంట్స్‌ను ఏ1గా చేర్చడంపై దురుద్దేశాలు
ఎవరిని కాపాడేందుకు? ఎవరిపై బురద జల్లేందుకు కుతంత్రం?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్‌వో), ప్రస్తుత గుంతకల్లు రైల్వే ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆయనను పరకామణి కేసులో ఉన్న తిరుపతికి చెందిన వ్యక్తులు హత్య చేసి ఉంటారని, వారిని ఏ1గా పేర్కొంటూ గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, సతీష్‌ది హత్యే అని కుటుంబసభ్యులు, ఆత్మహత్య అని విపక్ష నేతలు, ప్రమాదం అని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సతీష్ రైలు నుంచి కింద పడిపోయి ఉంటారా? లేదా ఎవరైనా తోసి ఉంటారా? అనే విచారణ క్రమంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
సీసీ ఫుటేజీ ఏమైంది?
పోలీసులు, రైల్వే వర్గాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం... తిరుమల పరకామణి కేసులో విచారణకు వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి 11.53 గంటలకు సతీష్ గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ 12. 55 గంటలకు వచ్చింది. అంటే, దాదాపు గంటసేపు సతీష్ రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. కానీ, ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. స్టేషన్‌లో కొత్తగా 82 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిలోని ఫుటేజీ బ్యాకప్ డేటా లేదని రైల్వే అధికారులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
ఆ గంటలో ఏం జరిగింది?!
గుంతకల్లు నుంచి సతీష్ మృతదేహం లభ్యమైన కోమలిలోని ఘటనా స్థలానికి గంట ప్రయాణం మాత్రమే. అంతలో ఆయన బోగీ డోర్ వద్ద మెట్లపై కూర్చుని ఉండగా కిందపడి ఉంటే రౌండ్‌గా తిరుగుతూ పడిపోతారని రైల్వే పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కింద పడినప్పుడు రాళ్లు బలంగా తగిలితే తల పగిలే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
సతీష్ మృతదేహం దొరికిన స్థలంలో చెప్పులు ఒకచోట పడిఉన్నాయి. ఆయన కింద పడిపోయి దొర్లుకుంటూ వచ్చి ఉన్నట్టు రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు పోలీసులకు దొరికాయి. ఆయన పక్కటెముకలు, ఒక కాలు విరగడం చూస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సీఐడీ అడిషనల్ డీజీ
సతీష్ మృతి కేసును సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. శుక్రవారం రాత్రి అనంతపురం చేరుకున్న ఆయన... డీఐజీ షిమోషీ, ఎస్పీ జగదీశ్‌తో సమావేశమయ్యారు. గెస్ట్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తునకు 10 బృందాలను నియమించారు. శనివారం కూడా సమీక్ష చేశారు. వైద్యులతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లతో మాట్లాడారు. ఘటనా స్థలిలో తీసిన ఫొటోలు, వీడియోలు, పోస్టుమార్టం నివేదికలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీక్షించారు.
అనంతపురం నుంచి కోమలికి చేరుకుని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఒక మనిషి బొమ్మను తీసుకుని వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు తోశారు. మరో రైలులో బొమ్మ తోయకుండా కిందపడేలా చేశారు. ఈ రెండు బొమ్మలు ఎలా వెళ్లాయి? గాయాలు ఎలా తగిలే అవకాశం ఉంది? తదితర అంశాలను శోధించారు. దీన్నంతటినీ వీడియో తీశారు. సతీష్ మృతదేహం దొరికిన ప్రాంతంలో రాళ్లు, ఇతర వస్తువులపై ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సతీష్ మొబైల్ ఫోన్ ఎక్కడ దొరికిందనే అంశంతో పాటు అందులో ఫోన్ కాల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు.
సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
తన సోదరుడిది హత్యే అని సతీష్ సోదరుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (1) ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ అని రాశారు. ఇందులో ఎవరి పేర్లూ రాయకపోవడం గమనార్హం. కాగా, అసలు ఘటన ఎలా జరిగింది? ప్రమాదమా? హత్యా? లేక ఆత్మహత్యనా? అన్నది ఏదీ తేలకుండా పోలీసులు పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్‌ను దోషులుగా చేర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సతీష్‌ది హత్యే అయితే, రైలులో అందుకు పాల్పడింది ఎవరు? వారు టికెట్‌తో ప్రయాణించారా? టికెట్ లేకుండా వచ్చారా? సతీష్ కిందపడిన కోమలి ప్రాంతం వద్ద ఎవరు వేచి ఉండి హత్య చేశారు? ఆ సమయంలో సెల్ టవర్ సిగ్నల్స్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలన్నీ లోతుగా పరిశీలించి, వారిని విచారించి ఆపై హత్యగా నిర్ధారించాల్సి ఉంది.
కానీ, కేసులో పరిశోధన పూర్తి కాకుండా, అనుమానాస్పద మృతి అనికాకుండా ఎఫ్‌ఐఆర్‌లో హత్యగా పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దల కీలక ఆదేశాలతో దీన్ని హత్యగా ధ్రువీకరించి, వారు అనుకున్న వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సతీష్ మృతిపై తిరుపతి రైల్వే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ప్రయాణించిన బోగీకి టీటీ (టికెట్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్)గా శోభారాణి విధుల్లో ఉన్నారు. మరో టీటీగా అప్పారావు ఉన్నారు. వీరికి చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ నాయుడు డ్యూటీలు వేశారు. ఈ ముగ్గురితో పాటు లోకో పైలట్, గార్డ్, స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగిని చిత్తూరు రైల్వే డీఎస్పీ హర్షిణి శనివారం విచారించారు. శుక్రవారం ఉదయం 6.26కు తిరుపతి చేరుకున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక బృందం పరిశీలించింది.
ఏ–1 కోచ్‌లో ప్రయాణించిన సతీష్‌కు లగేజీ అప్పగించిన బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్, ఏ–2 కోచ్‌కు చెందిన కృష్ణయ్యను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. సతీష్ సీటు 29 కాగా, ఆయన బ్యాగ్ 11వ నంబరు సీటులో లభిం
చింది. రైలు యార్డ్‌లోకి వచ్చిన వెంటనే శాంపిళ్లు తీసుకున్నారా లేదా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
ఎల్లో మీడియాకు లీకులతో...
సతీష్ మృతి విషయంలో కీలక అంశాలపై పోలీసులు దృష్టిపెట్టలేదనే ఆరోపణలుండగా.. మరోవైపు ప్రభుత్వం టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌కు, ఎల్లో మీడియాకు శుక్రవారం సాయంత్రమే లీకులిచ్చింది. తీరా ఎఫ్‌ఐఆర్‌లో హత్యగా శనివారం పేర్కొన్నారు. పైగా ఎవరి పేర్లూ లేకుండా ఏ–1గా ‘పరకామణి వ్యవహారంలో అపోనెంట్స్’ను చేర్చడం గమనార్హం. దీనివెనుక ఉద్దేశాలు ఏమిటి? అన్నది దీంతోనే తెలిసిపోతోంది. ఇదంతా చూస్తుంటే... ఎవరిని కాపాడేందుకు కుతంత్రం పన్నుతున్నారు? అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరిపై బురదజల్లేందుకు కుట్ర వ్యూహాలు రచిస్తున్నారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సతీష్ కుమార్ కేసు తాడిపత్రికి బదిలీ
గుత్తి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గుంతకల్లు జీఆర్‌పీ సీఐ, పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై గుత్తి జీఆర్‌పీ ఇన్‌చార్జ్ సీఐ అజయ్‌కుమార్ బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసును శనివారం తాడిపత్రి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?
» పోలీసులు కేసు నమోదు చేసినట్లు హత్య జరిగిందా?
» సతీష్ చనిపోయిన వెంటనే పోలీసులు ఆగమేఘాలపై ఆయన ఇంటిని ఎందుకు చుట్టుముట్టారు?
» ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు?
» ఆయన భార్య సెల్ ఫోన్‌ను ఎందుకు లాక్కున్నారు?
» ఆమె సెల్‌కు సతీష్ సెల్ నుంచి వచ్చిన మెసేజీల్లో ఏముంది?
» పోస్టుమార్టం రిపోర్ట్ రాకుండానే ‘హత్య’ అని ఎలా చెప్పారు?
» సందేహాలు నివృత్తి కాకముందే హత్య అని చెప్పడానికి అంత తాపత్రయం ఎందుకు?
» సతీశ్ కు చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన సివిల్ విభాగంలో కాకుండా ఏఆర్‌లో ఉండడంతో అందరితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్టు హత్యకు గురైతే, నిందితులు సతీశ్‌తో పాటు ప్రయాణం చేయాలి. అలాగైతే ఆ ఇతర వ్యక్తులు ఎవరు?
» సతీశ్ ప్రయాణించిన బోగీ ఏ–1 కోచ్ ఏసీ.. నిశబ్దంగా ఉంటుంది. ఒకవేళ తనపై ఎవరు దాడికి యత్నించినా పోలీస్ అయినందున కచి్చతంగా ప్రతిఘటించే తత్వం, శక్తి ఉంటాయి. అక్కడ అలాంటి గొడవ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ విషయాన్ని పోలీసులు గమనించ లేదా?
» సతీష్ కిందపడిన ప్రాంతానికి వాహనాలు వచ్చి ఉంటే టైర్ల గుర్తులు ఉండాలి కదా? రైల్లో ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ సేకరించారా?
» సతీశ్‌ను వెంటాడినట్లుగా సీసీ ఫుటేజీ లేదు. ఈ కీలక అంశాలపై పోలీసులు ఎందుకు దృష్టి సారించలేదు? ఇన్ని అనుమానాల మధ్య ఏ విధంగా హత్య కేసు నమోదు చేశారు?


