మొదటి వారంలో కంది కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: జనవరి మొదటి వారంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం ‘నాఫెడ్’ ద్వారా కందుల కొనుగోళ్లు ప్రారంభించున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పి.పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్‌లో సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతుల నుంచి 24,838 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని లక్ష్యం విధంచుకున్నామన్నారు. ఇప్పటి వరకు 5,759 మంది రైతులు ఆర్‌ఎస్‌కేల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. మిగతా రైతులు సాధ్యమైనంత తొందరగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే జనవరి మొదటి వారంలోపు కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. మండలానికి ఒకటి చొప్పున 31 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
శ్రుతి మించితే కఠిన చర్యలు
అనంతపురం సెంట్రల్: నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం రాత్రి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఆకతాయిల చేష్టలు శ్రుతిమించితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఒంటి గంటలోపు కార్యక్రమాలన్నీ ముగించాలని, నిర్ణీత సమయానికి మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని, టపాసులు, డీజేలు నిషేధించినట్లు తెలిపారు. 2026 నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో అక్టోబర్ నెలలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్‌రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు పాల్గొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.
మద్యం ఫుల్లుగా తాగేశారు
అనంతపురం
సెంట్రల్: జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. లైసెన్స్ దుకాణాల్లో 29,93,696 ఐఎంఎల్ (36.23శాతం పెరుగుదల) బాక్సులు, 29,13,786 బాక్సుల బీరు (37.37శాతం పెరుగుదల) అమ్మకాలు జరిగాయి. 2025 సంవత్సరంలో మద్యం విక్రయాలు, ఎన్‌ఫోర్సుమెంట్ చర్యలపై జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి రామమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలు అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాటుసారా స్థావరాలపై 298 దాడులు నిర్వహించి, 258 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 1,650 లీటర్ల సారా సీజ్ చేసి, 27,935 లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బెల్టు షాపులపై దాడులు చేసి 735 కేసుల్లో 734 మందిని అరెస్ట్ చేసి, 2848 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. కర్ణాటకకు చెందిన 2,848 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి, 26 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. ఏడు గంజాయి కేసుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, 16.63 కేజీల గంజాయితో పాటు 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిలటరీ మద్యం విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరిని, అక్రమంగా అమ్ముతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వివిధ కేసుల్లో 970 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు.
మొదటి వారంలో కంది కొనుగోళ్లు


