ముక్కోటి.. తరించిన భక్తకోటి
అనంతపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి
ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
అనంతపురం కల్చరల్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని ఉత్తరద్వారంలో భక్తకోటి దర్శించుకుని తరించింది. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని ప్రముఖ వైష్ణవాలయాలకు తెల్లవారుజామునుంచే భక్తుల రాక మొదలైంది. గోవిందనామ స్మరణతో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యం చెందారు. శ్రీవారి ఆలయంతో పాటు వివిధ దేవాలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల రథోత్సవాలు, గ్రామోత్సవాలు జరిగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


