కళ తప్పిన టీటీడీ
ఒకప్పుడు ఎంతో సందడిగా ఉండే అనంతపురంలోని టీటీడీ కల్యాణమంటపం ప్రస్తుతం నిర్వహణ లోపం కారణంగా కళావిహీనంగా మారింది. దీనికి తోడు టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు సైతం చేపట్టకపోవడంతో కల్యాణ మంటపం వైభవం మసిబారుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం టీటీడీ కల్యాణమంటపం చుట్టూ శ్రీవారి భక్తులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
అనంతపురం కల్చరల్: ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండడమే కాదు... భక్తి భావాన్ని పెంపొందించేలా టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు, డైరీలకు సహజంగానే డిమాండ్ ఎక్కువగానే ఉంది. తిరుమల క్షేత్రంలోని విశేషాలతో కూడిన వీటిని బంధుమిత్రులకు నూతన సంవత్సరం సందర్భంగా అందజేసి శుభాకాంక్షలు చెప్పడమనేది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి వాటి ఆచూకీ లేకుండా పోవడంతో భక్తులు పొరుగున ఉన్న కర్నూలులోని సీ క్యాంప్‌లో ఉన్న టీటీడీ కల్యాణ మంటపానికి పరుగు తీయాల్సి వస్తోంది. అనంతలో టీటీడీ కల్యాణ మంటపం నిర్వహణను లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్.. టీటీడీ ఉత్పత్తుల విక్రయాలపై ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
వైఎస్ జగన్ హయాంలో అనంత ముంగిటకే ప్రసాదం
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎనో వ్యయ ప్రయాసాలకోర్చి తిరుమలకెళ్లి లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లి బంధుమిత్రులకు సంబరంగా అందజేస్తుంటారు. అంతటి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కరోనే విపత్కర సమయంలో ఇంటి ముగింటకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేరువ చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్తు, ధర్మప్రచార మండలి ఆధ్వర్యంలో అప్పట్లో అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.10 లక్షలకు పైగా ప్రసాదాల విక్రయం సాగింది. అలాగే సనాతన ధర్మ ప్రచారానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అప్పటి టీటీడీ పాలక మండలి ఉచితంగా పంపిణీ చేసేలా అనంతపురం జిల్లాకు రెండు లక్షల భగవద్గీత పుస్తకాలను అందజేసింది. నేటికీ వీటి వితరణ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ కల్యాణమంటపంలో శ్రీవారి క్యాలెండర్లు, డైరీల విక్రయాలకు దిక్కు లేకుండా పోయింది.
ఎంఎస్ రాజుకు పట్టని టీటీడీ అభివృద్ధి
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియమితులయ్యారు. అయితే మడకశిరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల ఒరిగేదేమీ లేదంటూ హిందువుల మనోభావాలు కించపరుస్తూ మాట్లాడడం నేటికీ శ్రీవారి భక్తులు మరవలేక పోతున్నారు. టీటీడీ అభివృద్ధి పట్టని ఎంఎస్ రాజు.. శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను భక్తులకు చేరువ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. టీటీడీ ఉత్పత్తుల కోసం కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన ధార్మిక పుస్తక శాల భవనం తాళం భక్తులను వెక్కిరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి టీటీడీ ఉత్పత్తుల విక్రయాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మూతపడిన అనంతపురంలోని టీటీడీ ఉత్పత్తుల విక్రయశాల
వైఎస్ జగన్ హయాంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అందజేసిన భగవద్గీత పుస్తకాల బాక్స్‌లు
శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం భక్తుల అగచాట్లు
కొన్నేళ్లుగా ‘అనంత’లో విక్రయాలు తగ్గిస్తూ వచ్చిన లీజుదారు
రెండేళ్లుగా టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు బంద్
కళ తప్పిన టీటీడీ


