పరిశ్రమల ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి
అనంతపురం అర్బన్: పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామిక రంగం బలోపేతం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ఇంజినీరింగ్ పనులు జనవరిలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్‌ఎంను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పాలసీ కింద రెండు యూనిట్లకు విద్యుత్ రాయితీ రూ.29 వేలు, రెండు యూనిట్లకు వడ్డీ రాయితీ రూ.2.37 లక్షలు, ఐదు యూనిట్లకు పెట్టుబడి రాయితీ రూ.2.9 కోట్లు, ఒక యూనిట్‌కు అమ్మకపు పన్ను రాయితీ రూ.28.85 లక్షలు, ఒక యూనిట్‌కు స్టాంప్ డ్యూటీ రాయితీ రూ.1.02 లక్షలు మంజూరు చేశారు.
ప్లాట్లు రద్దు చేయండి
రాయదుర్గం టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాని వారికి నోటీసు ద్వారా తెలియజేసి.. వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో రాయదుర్గం పరిధిలోని టెక్స్‌టైల్ పార్కులో గార్మెంట్ యూనిట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయదుర్గం టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల నిర్మాణం చేపట్టని 47 మందితో మాట్లాడి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


