మళ్లీ యూరియా కొరత
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రబీకి సంబంధించి యూరియా కొరత మొదలైంది. వరి నాట్లు ప్రారంభం కావడం, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నకు యూరియా అవసరం ఉండటంతో డిమాండ్ కనిపిస్తోంది. కానీ వ్యవసాయశాఖ తగినంత యూరియా నిల్వ చేయడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌లో తీవ్ర సమస్య ఎదురైనప్పటికీ ఆ అనుభవంతో రబీలో మేలుకోకపోవడం గమనార్హం. ఇప్పుడిపుడే జిల్లాలో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అనంతపురంలో ఉన్న డీసీఎంఎస్‌కు పరిసర ఐదారు మండలాల నుంచి రైతులు వస్తున్నా.. వారానికి ఒక లారీ మాత్రమే యూరియా పంపిస్తుండంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. బయట ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్నా అవసరం లేని మరికొన్ని ఎరువులు, డ్రిప్ మందులు తీసుకోవాలని షరతు పెడుతుండటంతో దిక్కుతోచడం లేదని గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన రైతు నల్లప్ప, అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు నాగేశ్వరరెడ్డి ‘సాక్షి’ ఎదుట వాపోయారు. సొసైటీలు, రైతు సంఘాలు, ప్రైవేట్, హోల్‌సేల్ డీలర్ల వద్ద కూడా యూరియా సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ రబీలో 27,232 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక రూపొందించారు. గత ఖరీఫ్‌లో మిగులు యూరియా 3,610 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చూపించారు. మొత్తం మీద రబీలో ఇప్పటివరకు 20,729 మెట్రిక్ టన్నులు సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో అమ్మకాలు పోను ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనధికార సమాచారం ప్రకారం ఆన్‌లైన్‌లో 4 వేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చూపిస్తున్నా... భౌతిక నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో రైతులకు ప్రస్తుతం యూరియా దొరడం కష్టంగా మారింది. వరి నాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. జనవరిలో 15 వేల హెక్టార్లకు పైగా సాగులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.
జనవరిలో ఊపందుకోనున్న వరినాట్లు
ఖరీఫ్ సమస్య పునరావృతమయ్యే పరిస్థితి


