చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఎందుకు నోరుమెదపడం లేదు
ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లయితే.. 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు
దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు
కేవలం డబ్బు కోసమే కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతుల్లోకి తీసుకున్నారు
మీ అసమర్థత కారణంగా కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు
మీ తప్పులన్నీ సరిదిద్ది కోవిడ్, వరదలు వచ్చినా కీలక పనులన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తిచేశాం
రాష్ట్ర భవిష్యత్‌ను, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతారని మరోసారి నిరూపించారు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడం లేదు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఈ మేరకు బుధవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
1. చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆ మేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబు గారూ.. ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్‌ను, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతారని, మీ స్వార్థ రాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారు కదా?
2. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేం.
శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నికంటే సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబు గారూ..!
3. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.
నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు.
4. చంద్రబాబు గారూ.. గతంలో మీరు మీ స్వార్థం కోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్ డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తి చేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రం వాల్ కట్టారు. ఆ నిర్మాణాల్లో కూడా లోపాలే. కాఫర్ డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు.
ఆ ఖాళీలుగుండా వరదనీరు ఉధృతంగా ప్రవహించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి మీ నిర్వాకాలే కారణమని సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవలే తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు స్పిల్‌వేలలో పిల్లర్లు కూడా పూర్తిచేయకుండా గేట్లు పెట్టామంటూ ఫొటోలకు ఫోజులిచ్చిన చరిత్ర మీది. అయినా తప్పులు అంగీకరించడానికి, చేసిన వాటిని సరిదిద్దుకోవడానికి మీకు మనసు రాదు. మీ చేతిలో ఉన్న మీడియాతో నిరంతరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పుల నుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప, పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయితీ లేదు.
5. మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది, ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైయస్సార్‌సీపీ హయాంలో చేశాం. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశాం. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదు.
అంతేకాదు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. చంద్రబాబు గారూ.. మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా, అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బును విడుదల చేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
6. చంద్రబాబు గారూ.. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రం వాల్‌ను పూర్తిచేసి, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంను కట్టడంతోపాటు ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. ఇవన్నీ పూర్తిచేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు.
వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment