
శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న భక్తులు
ముందుగానే టికెట్ల జారీతో అవి దొరక్కపోవడంతో ఆగ్రహం
తిరుమల: తిరుమలో శ్రీవాణి టికెట్ల కోసం వచ్చిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆ ప్రభావం శ్రీవాణి టికెట్ల జారీపైనా పడింది. శనివారం తెల్లవారుజామున శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు భారీగా భక్తులు చేరుకోవడం.. టికెట్లను ముందుగానే జారీ చేయడంతో టికెట్లు దొరకని భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు శుక్రవారం భారీగా భక్తులు చేరుకోవడంతో రాత్రి 11 గంటల నుంచి ముందుగా టోకెన్లను జారీ చేశారు.
అప్పటికే భక్తుల రద్దీ మరింత పెరగడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు శ్రీవాణి టికెట్లను భక్తులకు జారీచేశారు. అనంతరం శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు చేరుకున్న మిగిలిన భక్తులకు టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా తెల్లవారుజాము నుంచి ముందుగా వచ్చిన భక్తులకు టోకెన్లు జారీచేసి ఉదయం 10 గంటల నుంచి టికెట్లను జారీ చేస్తారు. భక్తుల రద్దీ నియంత్రించలేనంతగా ఉండటంతో ముందుగానే టికెట్లను జారీ చేశారు.
అయితే శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో కొందరు భక్తులు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు తిరుమలలో ఆందోళన చేయడం తగదని సూచించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ముందుగా టికెట్ల జారీ చేశామని తెలిపారు. భక్తుల సమస్యలపై ఫిర్యాదుచేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో భక్తులు రద్దీ సమయంలో శ్రీవాణి దర్శన టికెట్లు కోటా పెంచి ఇవ్వాలని తిరుమల టూటౌన్ సీఐ శ్రీరాముడుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భక్తులు ఆందోళనను విరమించారు.