సాక్షి, అనంతపురం జిల్లా: సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్‌ఓ, ప్రస్తుత గుంతకల్లు రైల్వే పోలీస్ (జీఆర్పీ) సీఐ వై. సతీష్‌కుమార్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు తాడిపత్రి పోలీస్టేషన్‌కు గుత్తి రైల్వే పోలీసులు బదిలీ చేశారు. శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికపై చర్చ జరుగుతోంది. రైలు ఎక్కిన కాసేపటికే భార్యకు నాలుగుసార్లు సతీష్‌కుమార్ ఫోన్ చేశారు. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్ కంఫర్ట్‌గా ఉందంటూ వాట్సాప్ మెస్సేజ్ చేసినట్లు సమాచారం.
సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన సతీష్ కుమార్.. రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో తన బైక్ పార్క్ చేశారు. గుంతకల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలో సతీష్ కుమార్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్‌ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్క్ చేసిన సతీష్‌కుమార్.. గుంతకల్ రైల్వేస్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైల్వేట్రాక్ పక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి తిరుపతికి రైల్లో వెళుతూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకామణి కేసులో విచారణకు వెళుతున్న ఆయను ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్‌ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఈ ఏడాది జూలైలో జీఆర్పీ సీఐగా గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచి్చన తర్వాత పట్టణంలోని ఉరవకొండ రోడ్డులోని విశాల్ మార్టు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తారా (8), కుమారుడు రోహిత్(3) ఉన్నారు.
పరకామణి కేసులో ఈ నెల ఆరో తేదీన తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరైన సతీష్ కుమార్.. మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిజాముద్దీన్–తిరుపతి (రాయలసీమ ఎక్స్‌ప్రెస్) రైల్లో టూ టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వేట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్రగాయాలతో మృతిచెందిన వ్యక్తిని గుర్తించిన రైల్వేట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరా తీయగా.. గుంతకల్లు రైల్వే రిజర్వ్‌డు ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్‌గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షీమోíÙ, జిల్లా ఎస్పీ జగదీష్ , ఏఎస్పీ రోహిత్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని.. మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారు. డాగ్‌స్కా్వడ్, ఫొరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు. గుంతకల్లు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించారు. ఆయన ప్రయాణించిన బోగీలోని ప్రయాణికుల వివరాలనూ ఆరా తీస్తున్నారు. దీంతోపాటు సహచర ఉద్యోగులతో సతీష్ కుమార్ వ్యవహారశైలిపై విచారిస్తున్నట్లు సమాచారం. మృతికి కారణాలు విచారణలో తేలాల్సి ఉందని రైల్వే డీఎస్పీ శ్రీనివాసులు ఆచారి విలేకరులకు తెలిపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మ దంపతుల మొదటి కుమారుడు సతీష్ కుమార్. ఈయనది పేద కుటుంబం, తండ్రి మరణంతో తమ్ముడు శ్రీహరితో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కష్టపడి చదవి పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించారు. సతీష్ కుమార్ 2012 బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్న చివరి బ్యాచ్ వీరిదే. తొలిపోస్టింగ్ చిత్తూరు జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వచి్చంది. తర్వాత చాలా ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పనిచేశారు.
2012 బ్యాచ్‌లో రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన వారిలో కూడా సతీష్‌కుమార్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన బ్యాచ్‌మేట్స్ చాలా మంది ఇంకా ఆర్‌ఎస్‌ఐలుగానే ఉన్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన సమయంలో ఈయన ఏవీఎస్‌ఓగా పనిచేస్తున్నారు. ఈనెల ఆరున సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మరోసారి హాజరుకావాల్సి ఉందని గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారు. అంతలోనే ఇలా జరగడంపై చాలా మంది బ్యాచ్‌మేట్స్, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరో తేదీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత కొందరు సహచరులతో మాట్లాడుతూ తనకు మెమో ఇస్తారని, లేదా సస్పెండ్ చేస్తారని వాపోయినట్లు తెలిసింది.


