ఇది ముమ్మాటికీ చంద్రబాబు సర్కారు హత్యే: భూమన
పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్ ను బెదిరించిన ప్రభుత్వం
సతీష్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే మృతి చెందారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి కారణమైన ప్రభుత్వం, పోలీస్ అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చినవారందరినీ దోషులుగా చేర్చాలన్నారు.
విచారణ పేరుతో సాటి పోలీసులనే వేధిస్తూ, తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఈ ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెర తీసిందని మండిపడ్డారు. పోలీసు అధికారుల మరణాలకు కారణమయ్యేలా జరుగుతున్న విచారణలు పోలీసు సమాజానికే అవమానకరమన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలన్న ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు.
సీబీఐతో విచారణ జరిపించాలి..
‘ఈ ప్రభుత్వం చేస్తున్న అపచారాలను ప్రశి్నస్తున్న నన్ను దోషిగా ఇరికించేందుకు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడి నుంచి నారా లోకేష్ వరకూ ఏ రకంగా మాట్లాడారో, ట్వీట్లు చేశారో అందరికీ తెలుసు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. సతీష్ మరణం వెనుక కారణాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. పది రోజులుగా జరుగుతున్న సీఐడీ విచారణ తతంగం, న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి జరుగుతున్న యత్నాలపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని భూమన డిమాండ్ చేశారు.
ఇది ప్రభుత్వ హత్యే..!
‘పరకామణికి సంబంధించి రెండు నెలలుగా పత్రికల్లో వస్తున్న కథనాలతో సతీష్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. వారం రోజులుగా సీఐడీ విచారణ పేరుతో తనను వేధిస్తోందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం నా పేరు చెప్పాలంటూ సతీష్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేసింది. పోలీసు అధికారుల ద్వారా రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రలకు ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బలైపోయారు. ఎస్పీ గంగాధర్, డీఎస్పీలు వేణుగోపాల్, గణపతి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.
పరకామణి కేసును విచారిస్తున్న అధికారులు న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రౌడీలు, గూండాల తరహాలో పచ్చి బూతులు తిడుతూ విచారణ ఎదుర్కొంటున్న వారిని వేధిస్తున్నారు. ఏ అర్హత లేని లక్ష్మణ్ రావు అనే క్రిమినల్ కూడా విచారణలో పాల్గొని సతీష్ కుమార్‌ను బండ బూతులు తిట్టాడు. తన పై అధికారి సీవీఎస్వీ నరసింహ కిషోర్ చెప్పడం వల్లే రాజీకి వెళ్లానని అధికారులకు సతీష్ కుమార్ చెప్పారు’ అని భూమన చెప్పారు.


